అక్షరటుడే, బోధన్: Navipet Mandal | అక్కతో రాఖీ కట్టించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.
అతడితో పాటు అతడి స్నేహితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన నవీపేట మండల (Navipet Mandal) జగ్గారావు ఫారం వద్ద శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నవీపేట ఎస్సై వినయ్ (Navipet SI Vinay) తెలిపిన వివరాల ప్రకారం రాఖీ పండుగ సందర్భంగా బాసరకు చెందిన యువకుడు సాయిబాబు నిజామాబాద్‌లో (Nizamabad) ఉంటున్న అక్క ఇంటికి రాఖీ కట్టించుకోవడానికి అతని స్నేహితుడితో కలిసి వచ్చాడు.
రాఖీ కట్టించుకుని శనివారం మధ్యాహ్నం తిరిగి బాసరకు వెళ్తుండగా.. నవీపేట మండలం జగ్గారావు ఫారం వద్ద కంటైనర్‌ను వెనుక నుండి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సాయిబాబు(19) అక్కడికక్కడే మృతి చెందగా అతని స్నేహితుడు అరవింద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు సాయిబాబు బాసరలోని సరస్వతి దేవాలయం (Saraswati Temple) వద్ద ఓ షాపులో పనిచేస్తున్నాడు. మృతుడి మేనమామ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.