అక్షరటుడే, బాన్సువాడ: World Meditation Day | మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం సరైన మార్గమని యోగా గురువు వొట్లం శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ప్రపంచ ధ్యాన(Meditation) దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, బాన్సువాడ ప్రభుత్వ యునాని వైద్యశాల(Government Unani Hospital) సహకారంతో ఆదివారం బాన్సువాడ ప్రభుత్వ ఆశ్రమ గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో ధ్యానం, యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
World Meditation Day | నేటి జీవనశైలిలో..
ఈ సందర్భంగా యోగా గురువు వొట్లం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నేటి జీవనశైలిలో ప్రతిఒక్కరినీ వేధిస్తున్న మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ధ్యానమే ప్రధాన మార్గమని తెలిపారు. ప్రశాంతత, ఏకాగ్రత సాధించడంలో ధ్యానం కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ధ్యాన సాధనల ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని, ధృతి శక్తి, స్మరణ శక్తి, మేధాశక్తి వికాసానికి యోగా ప్రక్రియలు ఎంతో ఉపకరిస్తాయని వివరించారు.
World Meditation Day | క్రమశిక్షణతో కూడిన జీవన విధానం..
క్రమశిక్షణతో కూడిన జీవన విధానాలను అలవర్చుకోవడం ద్వారా ఆయురారోగ్యాలు సాధించి సుఖసంతోషాలతో జీవించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం విజయభారతి, ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ధ్యాన, యోగా సాధనల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.