అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Former MLA Arrested | మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్‌లలోకి ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) యథేచ్ఛగా వెళ్లి ఓట్లు వేయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ (Former MLA Jajala Surender) ఆరోపించారు. ఈ మేరకు ఎల్లారెడ్డి బస్టాండ్ ప్రాంతంలో ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Yellareddy Former MLA Arrested | జెడ్పీహెచ్ఎస్ బాలబాలికల పాఠశాల పోలింగ్ సెంటర్లో..
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ జెడ్పీహెచ్ఎస్ బాలబాలికల పాఠశాల పోలింగ్ సెంటర్‌ను సందర్శించారు. ఆయన తన పీఏలు, బాడీగార్డులతో పోలింగ్ బూత్‌లోకి వెళ్లారని.. ఇష్టారీతిన ఓట్లు వేయిస్తున్నారని పోలింగ్ బూత్‌కు చేరుకున్న జాజాల సురేందర్ ఆరోపించారు.
పోలీసుల నిలదీత
పాఠశాల పోలింగ్ బూత్ వద్ద విధుల్లో ఉన్న స్థానిక సీఐ రాజిరెడ్డి మాజీ ఎమ్మెల్యేli అడ్డుకున్నారు. ఎమ్మెల్యేను పోలింగ్ కేంద్రాల్లోకి ఎలా అనుమతించారని సీఐ రాజిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే నిలదీశారు. అధికార పార్టీకి కండువాలు కప్పుకున్న పార్టీ కార్యకర్తలకు పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకుల చెప్పుచేతుల్లో పనిచేస్తున్నారని సీఐపై విరుచుకుపడ్డారు. ఏ అధికారంతో ఎమ్మెల్యేను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించారని ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ కోసమే ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎమ్మెల్యేను ఎలా అనుమతి ఇస్తారని ఆయన గట్టిగా నిలదీశారు.
స్థానిక బస్టాండ్ వద్ద రాస్తారాకో..
ఎన్నికల కోడ్ ఉన్నందున పోలింగ్ బూత్ వద్దకు అనుచరులతో రావడం చట్ట వ్యతిరేకమని సీఐ రాజిరెడ్డి (CI Raji reddy) మాజీ ఎమ్మెల్యే జాజాలకు సమాధానం ఇవ్వడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పార్టీ కార్యకర్తలతో కలిసి స్థానిక బస్టాండ్ ప్రాంతంలో రహదారిపై భైఠాయించి ధర్నా రాస్తారోకో చేపట్టారు. విషయం తెలిసిన పార్టీశ్రేణులు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..
ఈ సందర్భంగా జాజాల మాట్లాడుతూ.. ప్రభుత్వ బాధ్యతల్లో ఉన్న పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులే(Yellareddy Police) ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఓట్లు లేని స్థానికేతరులు ఉండద్దని ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నా ఎమ్మెల్యే, ఆయన పీఏలు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పీఏలు గుండాలను తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను, ఓటర్లను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
పోలీసులు కళ్లు మూసుకుని..
పోలీసులు కళ్లు మూసుకుని అధికార పార్టీ మద్దతుగా విధులు నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యవాదులు ఈ చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని సూచించారు. స్థానిక డీఎస్పీ శ్రీనివాసులు అక్కడికి చేరుకొని మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నందున ఆందోళన చేయడం తగదని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు చేపడతామని స్థానికేతరులు పోలింగ్ బూత్‌లోకి రాకుండా చర్యలు తీసుకుంటామని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు బలవంతంగా తమ వాహనంలోకి ఆయనను ఎక్కించారు. జాజాలను అరెస్టు చేసి అక్కడినుంచి నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జాజాలను అరెస్టు చేసి పార్టీ శ్రేణులను ఒక్కొక్కరిని అక్కడి నుంచి పోలీసులు పంపించేశారు.
