అక్షరటుడే, ఎల్లారెడ్డి : కాంటూరు తవ్వకాలతో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లి పరిధిలో కాంటూరు కందకాల తవ్వకాల పనులె, అంగన్వాడీ, నర్సరీలను ఆయన పరిశీలించారు.
Contour Trenches Groundwater Growth | కాంటూరు కందకాలదే కీలకపాత్ర..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ శివారులో సాగుతున్న కాంటూరు కందకాల తవ్వకాలు భూగర్భ జలాల నిల్వలను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. పనుల నాణ్యత, కొలతలు, సాంకేతిక ప్రమాణాల అమలు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
Contour Trenches Groundwater Growth | ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి
ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు తాగునీరు, నీడ, ప్రాథమిక వైద్య సదుపాయాలు తదితర వసతులపై ఆరా తీశారు. కార్మికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలనే దిశగా అధికారులకు సూచనలు ఇచ్చారు. ఉపాధి హామీలో జరుగుతున్న ఈ పనుల ద్వారా నీటి వనరుల అభివృద్ధికి తోడ్పడమే కాకుండా, స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కలెక్టర్ తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను వేగంగా జరిగేలా చూడాలన్నారు.
Contour Trenches Groundwater Growth | అంగన్వాడీ కేంద్రం.. నర్సరీ పరిశీలన..
అనంతరం కలెక్టర్ తిర్మన్‌పల్లి గ్రామంలోని (Tirmanpalli Village) అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులతో ముచ్చటించిన కలెక్టర్, వారి చదువు, ఆరోగ్యం, పౌష్టికాహారంపై ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు చెప్పిన రైమ్స్, అక్షరాలు, సంఖ్యలను శ్రద్ధగా విని చిన్నారుల ఉచ్చారణ, ఆత్మవిశ్వాసం, అభ్యసనస్థాయిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆటల ద్వారా, పాటల ద్వారా బోధన కొనసాగించాలని, ప్రతి చిన్నారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కేంద్రంలో (Anganwadi Center) అందిస్తున్న పోష్టికాహారం, హాజరు రిజిస్టర్లు, స్టోర్‌రూమ్ నిర్వహణను పరిశీలించి, అన్ని రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. స్టోర్‌రూంలో వస్తువుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.
Contour Trenches Groundwater Growth | నర్సరీ సందర్శన..
అనంతరం స్థానిక నర్సరీలో మొక్కల పెంపకం విధానం, విత్తనాల నాణ్యత, నీటిపారుదల సౌకర్యాలు, సంరక్షణ చర్యలను కలెక్టర్ పరిశీలించారు. మొక్కల సంరక్షణలో శాస్త్రీయ పద్ధతులు అనుసరించాలని సూచించారు. నర్సరీల ద్వారా పర్యావరణ పరిరక్షణకు, హరితాభివృద్ధికి కలిగే ప్రయోజనాలను వివరించిన కలెక్టర్, పెద్దఎత్తున మొక్కల ఉత్పత్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేందర్, ప్రత్యేక అధికారి సతీష్, డీఎల్పీవో, డీడబ్ల్యూవో ప్రమీల, మండల స్థాయి అధికారులు, సాంకేతిక సిబ్బంది సర్పంచ్ లాల్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.
