అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయాలంటున్న అమెరికా.. మరి ఆ దేశం నుంచి ఎందుకు రసాయనాలు, ఎరువులను దిగుమతి చేసుకుంటుదన్న ఇండియా ప్రశ్నకు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. రష్యా నుంచి దిగుమతుల విషయంపై తనకు తెలియదని బదులిచ్చారు. దీని గురించి తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో భారత్‌పై వంద శాతం సుంకాలు (Tariffs) విధిస్తానని చెప్పిన ట్రంప్.. ఆ తర్వాత మాట మార్చారు. సుంకాలు ఎంత పెంచాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
రష్యా ముడి చమురు (Russian crude oil), ఆయుధాలను (Weapons) భారత్ కొనుగోలు చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఇండియా (India) మాస్కోకు నిధులు చేకూర్చుతోందని ఆరోపించారు. ఇప్పటికే 25 శాతం సుంకాలను విధించిన ట్రంప్.. 24 గంటల్లో మరోసారి భారీగా టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను మృత ఆర్థిక వ్యవస్థలుగా పేర్కొన్న ఆయన.. రష్యా (Russia) నుంచి చమురు కొంటున్నందుకు భారత్‌పై గుర్రుగా ఉన్నారు.
అయితే, అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల ద్వంద్వ వైఖరిపై ఇండియా తీవ్ర స్థాయిలో మండిపడింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని తమపై ఒత్తిడి తెస్తున్న ఆయా దేశాలు మరి మాస్కో నుంచి ఎందుకు అరుదైన ఖనిజాలు, ఎరువులు, రసాయనాలు కొనుగోలు చేస్తున్నాయని ప్రశ్నించింది. ట్రంప్ వైఖరి అసమంజసమని విమర్శించింది.
ఇండియా చేసిన విమర్శలపై ట్రంప్ తాజాగా స్పందించారు. రష్యా నుంచి రసాయనాలు, ఎరువుల దిగుమతుల గురించి తనకు తెలియదని చెప్పారు. “నాకు దాని గురించి ఏమీ తెలియదు. దీనిపై చెక్ చేసుకోవాల్సి ఉందని” బదులిచ్చారు. అంతేకాకుండా, ఇండియా రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొని, బహిరంగ మార్కెట్లలో ఎక్కువ ధరకు అమ్మి భారీ లాభాలను ఆర్జిస్తోందని ఆరోపించారు. రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం సుంకాలు విధించడం గురించి విలేకరులు ప్రశ్నించగా, ఎంత పెంచుతామని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. “నేను ఎప్పుడూ శాతం గురించి చెప్పలేదు, కానీ మేము దానిపై ఆలోచిస్తున్నాం. ఎంతో కొంత శాతం పెంచుతామని” ఆయన తెలిపారు. ” ఏం జరుగుతుందో చూద్దాం… రేపు రష్యాతో సమావేశం ఉంది. ఏమి జరుగుతుందో మనం చూడబోతున్నాం” అని ట్రంప్ అన్నారు.