అక్షరటుడే, వెబ్‌డెస్క్: Male contraceptive pills | ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా గర్భనిరోధక మాత్రలు మహిళలకు మాత్రమే ఉంటాయి. పురుషులు వాడే మాత్రలు ఇప్పటి వరకు రాలేదు. దాదాపు ఏడెనిమిది దశాబ్దాలుగా వాటిపై అనేక దేశాలకు చెందిన శాస్త్రజ్ఞులు (Scientists) ప్రయోగాలు చేస్తున్నా ‘మేల్ బర్త్ కంట్రోల్ పిల్స్’ను మాత్రం అభివృద్ధి చేయలేకపోయారు.
అయితే, ఈ దిశగా ఇప్పటివరకు సాధించని కీలక పురోగతిని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాకు (University of Minnesota) చెందిన శాస్త్రవేత్తలు సాధించినట్టు తెలుస్తోంది. కోలంబియా యూనివర్సిటీ మరియు సాన్ ఫ్రాన్సిస్కోకు (Columbia University and San Francisco) చెందిన యువర్ ఛాయిస్ థెరప్యూటిక్స్ సంస్థ శాస్త్రజ్ఞులతో కలిసి వారు అభివృద్ధి చేసిన ‘వైసీటీ-529’ (YCT-529) అనే హార్మోన్ రహిత మేల్ గర్భనిరోధక మాత్రను రూపొందించారు.
Male contraceptive pills | దుష్ప్రభావాలు నిల్
ఈ మందును ఎలుకలపై మరియు సైనోమోల్గస్ జాతికి చెందిన కోతులపై నిర్వహించిన ప్రయోగాల్లో, ఇది 99 శాతం వరకు ప్రభావవంతంగా పనిచేసిందని శాస్త్రవేత్తలు తెలిపారు. వీర్యకణాల తయారీలో కీలకమైన విటమిన్ Aను వృషణాలకు అందకుండా నిరోధించడం ద్వారా స్పెర్మ్ ఉత్పత్తిని (sperm production) అడ్డుకుంటుందని వారు వివరించారు. అయితే ప్రస్తుతం పురుషుల గర్భనిరోధక మాత్రల పరిశోధనలో విప్లవాత్మక పురోగతి సాధిస్తూ.. వైసీటీ-529 (YCT-529) అనే ప్రాయోగిక మాత్ర తొలి మానవ పరీక్షలో విజయవంతమైంది. పురుషులు వాడే గర్భనిరోధక మాత్రకు ఇది శాస్త్రీయంగా పునాది వేసిన చారిత్రాత్మక ఘట్టంగా చెబుతున్నారు.
ముఖ్యంగా ఇది హార్మోన్లపై ఎలాంటి ప్రభావం చూపకుండా, తాత్కాలికంగా స్పెర్మ్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఇది భవిష్యత్తులో దంపతులు గర్భనిరోధక బాధ్యతను సమానంగా పంచుకునే కొత్త దారిని చూపించనుంది. సంస్థ అభివృద్ధి చేసిన ఈ మందు, రెటినోయిక్ యాసిడ్ రిసెప్టర్ ఆల్ఫా (RAR-α) అనే ప్రోటీన్‌ను నిరోధించడం ద్వారా స్పెర్మ్ ఉత్పత్తి ఆపేస్తుంది. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిని ప్రభావితం చేయదు. ఔషధం తీసుకోవడం ఆపిన తర్వాత, వ్యక్తి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా తిరిగి పొందగలడు. ఇది వాడాక ఎలాంటి దుష్ప్రభావాలు, ప్రతికూల ప్రభావాలు కనిపించలేదు.
మొదటి దశ (ఫేజ్ 1ఎ) క్లినికల్ ట్రయల్‌లో (Phase 1A clinical trial) మొత్తం 16 మంది ఆరోగ్యవంతమైన పురుషులు పాల్గొనగా వారి వయస్సు 32-59 సంవత్సరాలు. పరీక్షలో పాల్గొన్నవారు 10, 30, 90, లేదా 180 మిల్లీ గ్రామ్‌ల డోస్‌లలో వైసీటీ-529 లేదా ప్లాసిబో తీసుకున్నట్టు తెలిపారు. ఇందులో కొంతమంది ఏమీ తినకుండా తీసుకోగా, మరికొంతమంది అధిక కొవ్వు, అధిక కేలరీల ఆహారం తీసుకున్న తర్వాత 30 మిల్లీగ్రాముల డోస్ తీసుకోవడం జరిగింది. దీని వలన వీర్యం స్థాయి సగానికి తగ్గింది. ఎలాంటి ప్రతికూల ప్రభావాలు కనిపించలేదు. మొదటి ట్రయల్ మంచి రిజల్ట్ ఇవ్వడంతో ప్రస్తుతం 28 రోజులు, 90 రోజుల పాటు వైసీటీ-529ను తీసుకునే 50 మంది పురుషులతో రెండో దశ (ఫేజ్ 1బీ/2ఏ) ట్రయల్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.