అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala | శ్రీవారి పరకామణి (Parakamani) సొత్తు చోరీ జరిగిందనే వార్తలు రావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తిరుమల క్షేత్రంలో పరకామణి సొత్తు రూ.100 కోట్లు చోరీ చేశారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) ఆరోపించిన విషయం తెలిసిందే.
పరకామణి సొత్తు చోరీ వ్యవహారంపై తాజాగా ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. వైసీపీ దొంగలు శ్రీవారి సొత్తును దోచుకున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ గ్యాంగ్ జనాన్ని దోచుకోవడంతో పాటు తిరుమలను సైతం వదల్లేదన్నారు. నాటి టీటీడీ (TTD) ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అండదండలతో పరకామణిని కొల్లగొట్టారని లోకేష్ ఆరోపించారు. రూ.కోట్లు కొల్లగొట్టి రియల్ ఎస్టేట్‌లో పెట్టారని ఆయన అన్నారు.
Tirumala | చేయని అపచారం లేదు
శ్రీవారి సొత్తును కొల్లగొట్టి వాటాలు భూమన నుంచి తాడేపల్లి ప్యాలస్ వరకు వెళ్లాయని లోకేష్ అన్నారు. హుండీ కానుకలు వందలకోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసు రాజీ చేసేందుకు భూమన యత్నించారన్నారు. అధికారంలో ఉన్న సమయంలో జగన్ (Jagan) గ్యాంగ్ చేయని అపచారం లేదన్నారు. లడ్డూను కల్తీ చేశారు, టికెట్లు అమ్ముకున్నారని విమర్శించారు. జగన్ పాపం పండటంతో పరకామణి చోరీ వీడియోలు బయట పడ్డాయన్నారు.
Tirumala | అసలు ఏం జరిగిందంటే..
తిరుమలలోని పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేస్తున్న వీడియోను టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి శనివారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ఈ చోరీ చేశారని ఆరోపించారు. వైసీపీ (YCP) హయాంలో స్వామివారి పరకామణిలో రూ.వంద కోట్ల దొంగతనం చేశారన్నారు. ఈ కేసును హైకోర్టు సీఐడీకి అప్పగించిందన్నారు. కాగా ఈ కేసును లోక్ అదాలత్ ద్వారా రాజీ చేయడానికి అప్పట్లో యత్నించారని ఆరోపించారు. ఇందులో చాలా మంది ప్రమేయం ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలో వారందరి పేర్లు బయటకు వస్తాయన్నారు.
తిరుమల (Tirumala) శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. స్వామి వారి దర్శనంతో పులకించిపోతారు. కొండపైకి వెళ్తే ఆధ్యాత్మికతతో పరవశిస్తారు. అలాంటి తిరుమల కొండ చుట్టూ వివాదాలు నెలకొంటుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో లడ్డూ కల్తీ వ్యవహారం, తాజాగా పరకామణి సొత్తు చోరీ ఆరోపణలు రావడంతో అధికారులు, నేతల తీరుపై విమర్శలు చేస్తున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.