అక్షరటుడే, వెబ్డెస్క్ : Kavitha | సామాజిక తెలంగాణ కోసమే పోరాటం తమ పోరాటం కొనసాగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల త్యాగాలకు విలువ రావాలంటే సామాజిక తెలంగాణ రావాలన్నారు.
ఇదే లక్ష్యంతో త్వరలోనే తెలంగాణ (Telangana) వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటో లేకుండానే జాగృతి ముందుకెళ్తుందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) చుట్టూ దుర్మార్గులు ఉన్నారని, వారి నుంచి కాపాడేందుకు తాను అన్ని ప్రయత్నాలు చేశానన్నారు. కానీ తననే పార్టీ నుంచి పంపించేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్న కవిత ఇందుకు సంబంధించిన పోస్టర్ను కవిత బుధవారం హైదరాబాద్ జాగృతి కార్యాలయంలో (Hyderabad Jagruti Office) ఆవిష్కరించారు. దీపావళి తర్వాత మొదలు కానున్నఈ యాత్ర 33 జిల్లాలను కవర్ చేస్తూ ఫిబ్రవరి వరకు కొనసాగనుంది. పోస్టర్ల ఆవిష్కరణ సందర్భంగా కవిత మాట్లాడుతూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జనం బాట’ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు నాలుగు నెలల పాటు యాత్ర కొనసాగుతుందన్నారు.
Kavitha | నినాదం కాదు.. విధానం
సామాజిక తెలంగాణ సాధన కోసం జాగృతి పోరాటం చేస్తుందని కవిత (Kavitha) తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్తామన్నారు. దీపావళి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు కవిత చెప్పారు. అన్ని జిల్లాలను కలుపుకుంటూ ఫిబ్రవరి వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. జిల్లాల్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో కలిసి మాట్లాడతామని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం ఏం చేయాలనే విషయాలను ప్రజల నుంచే తెలుసుకుంటామన్నారు. సామాజిక తెలంగాణ అంటే నినాదం కాదు విధానమని వివరించారు. తాము ఉన్నన్ని రోజులు సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే గురువులన్నారు. పెద్ద పెద్ద నాయకులను కూడా ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోపెట్టారన్నారు.
Kavitha | కేసీఆర్ చుట్టూ దుర్మార్గులు..
తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూ దుర్మార్గులు చేరారని కవిత మండిపడ్డారు. కేసీఆర్ అనే చెట్టు చుట్టూ దుర్మార్గులున్నారని, వారి నుంచి కేసీఆర్ చెట్టును కాపాడేందుకు తాను చేయని ప్రయత్నం లేదన్నారు. ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయిందని చివరకు తననే పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. కేసీఆర్‌కు మచ్చ రాకుండా ఉండాలనే ప్రయత్నం చేశాను. కానీ నన్ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
జాగృతి మొదటి నుంచి స్వతంత్రంగా పని చేసిందని.. కేసీఆర్ నుంచి ఒక్క ఆలోచన తీసుకోలేదన్నారు. అయితే, ఉద్యమంలో పేగులు తెగేదాక తెలంగాణ కోసం కోట్లాడానని చెప్పారు. తాను బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత పార్టీతో జాగృతి అనుసంధానంగా పని చేసిందన్నారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నామని.. సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం మాట్లాడడం తప్పా అని ప్రశ్నించారు. ఏదో తప్పు మాట్లాడినట్టు చూపించి కుట్ర చేసి బయటకు పంపారన్నారు. దుర్మార్గుల బారి నుంచి కేసీఆర్ అనే చెట్టును కాపాడాలని తాను ప్రయత్నం చేస్తే తనను వెళ్లగొట్టారన్నారు. ఇక ఆ చెట్టు నీడ నాది కాదని చెప్పినప్పుడు నా తోవ నేను చేసుకుంటున్నానని చెప్పారు. దారులు వేరని తెలిసినప్పుడు అంతకుమించి చేసేదేమీ లేదన్నారు.
Kavitha | నాన్న ఫొటో లేకుండానే..
తన తండ్రి కేసీఆర్ ఫొటో లేకుండానే యాత్ర చేస్తానని కవిత చెప్పారు. ఇది కేసీఆర్‌ను కించపరిచే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం కాదన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ లేదన్నారు. అయితే, ఆయన ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారని, ఆయన ఫొటో పెట్టుకోవడం భావ్యం కాదన్నారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే మనస్తత్వం తనది కాదని తెలిపారు.
కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, ఇక ఆయన ఫొటో పెట్టుకోవడం ప్రజల్లోకి వెళ్లడం నైతికంగా సరికాదన్నారు. అందుకే కేసీఆర్ ఫొటో లేకుండా తన యాత్ర కొనసాగుతుందని చెప్పారు. జాగృతిని స్థాపించాక అనేక పోరాటాలు చేసినా ఏనాడూ కేసీఆర్ ఫొటో పెట్టలేదన్నారు. అయితే, తాను ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచే కేసీఆర్ ఫొటో పెడుతున్నట్లు తెలిపారు. కేసీఆరే తనను సస్పెండ్ చేశాక, ఆయన ఫొటో పెట్టుకోవడం నైతికత అనిపించుకోదన్నారు. అందుకే కేసీఆర్ ఫొటో లేకుండా తన యాత్ర కొనసాగుతుందని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫొటో పెట్టుకుని యాత్ర చేస్తానన్నారు.
Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింట్లోనూ విఫలమే..
అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అన్ని రంగాల్లోనూ విఫలమైందని కవిత విమర్శించారు. ఏ ఒక్క రంగంలోనూ ముందడుగు పడలేదన్నారు. అనేక సమస్యలు తెలంగాణను పట్టి పీడిస్తున్నాయని, ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుందన్నారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒక్క రూపాయి కూడా తేలేకపోతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, అయితే, ఎందుకు ఆమోదించడం లేదో తనకు తెలియదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నన్ను వద్దనుకుంది. ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవి అక్కర్లేదని భావించే తాను రాజీనామా చేశానన్నారు.
Kavitha | కొత్త పార్టీపై ఆలోచించలేదు..
ప్రస్తుతానికి పార్టీ పెట్టడంపై ఎలాంటి ఆలోచన లేదని కవిత వెల్లడించారు. పార్టీ పెట్టాలో లేదో ఇప్పటికీ క్లారిటీ లేదన్నారు. ప్రజలతో మాట్లాడిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దానికన్నా ముందు అనేక సమస్యలు ఉన్నాయని, వాటిపై కొట్లాడతామని ప్రకటించారు. బనకచర్ల, గోదావరి జలాల నుంచి మొదలు యూరియా కొరత వరకు అనేక సమస్యలపై తాము కొట్లాడతామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా, ఆమె నేరుగా స్పందించలేదు. ఉప ఎన్నిక చాలా చిన్న విషయమని దాంతో జాగృతికి సంబంధం లేదన్నారు.