అక్షరటుడే, వెబ్డెస్క్: Yash Dayal | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ యశ్ దయాల్(Yash Dayal)పై లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా, ఇందిరాపురం పోలీస్ స్టేషన్(Indirapuram Police Station)లో యువతి ఉజ్వల సింగ్ ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆమె ఆరోపణల ప్రకారం, పెళ్లి పేరుతో మోసం చేసి, గత ఐదేళ్లుగా తనతో లైంగిక సంబంధం పెట్టుకుని, శారీరకంగా మరియు మానసికంగా వేధించాడని పేర్కొంది. పోలీసులు స్పందించని నేపథ్యంలో, ఉజ్వల సింగ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్యాలయానికి(UP CM Yogi Adityanath Office) ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసింది. సీఎంవో విచారణకు ఆదేశించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Yash Dayal | రివర్స్ కౌంటర్
బాధితురాలు తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించింది. చాటింగ్ స్క్రీన్‌షాట్లు, ఫొటోలు, వీడియో కాల్ రికార్డులు అన్ని కూడా పోలీసులకు అందించింది. అలాగే యశ్ దయాల్ తన వద్ద నుంచి డబ్బులు తీసుకున్నాడని కూడా ఆరోపించింది. ఈ ఆరోపణలపై యశ్ దయల్ తండ్రి స్పందిస్తూ, ఆ యువతి తమకు తెలియదని, ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నాడు. ఇక తాజాగా యశ్ దయాల్ ఈ ఇష్యూపై స్పందించాడు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ఇప్పుడు ఆయన ఎదురు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. యువతి చేసిన ఫిర్యాదుతో ప్రారంభమైన వివాదం, తాజాగా ప్రత్యారోపణలతో కొత్త మలుపు తిరిగింది.
యశ్ దయాల్ ప్రయాగ్‌రాజ్‌లోని ఖుల్దాబాద్ పోలీస్ స్టేషన్ (Khuldabad Police Station)లో ఆ యువతిపై ఎదురు ఫిర్యాదు చేశాడు. 2021లో ఇన్‌స్టాగ్రామ్, ద్వారా ఆమెతో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి రెగ్యులర్‌గా మాట్లాడుకుంటున్నామని వెల్లడించాడు. ఆమె తన ఐఫోన్(iPhone), ల్యాప్‌టాప్ (Laptop)దొంగిలించిందని, పైగా తనకు, తన కుటుంబానికి వైద్య ఖర్చుల పేరుతో లక్షలాది రూపాయలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆరోపించాడు. అంతేకాకుండా, షాపింగ్ కోసం కూడా అనేకసార్లు డబ్బులు తీసుకుందని, దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.
ఘజియాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్(Ghaziabad Police FIR)పై సమాచారం వచ్చిన వెంటనే తాను న్యాయపరంగా స్పందించాలని నిర్ణయించుకున్నట్లు యశ్ దయాల్ వెల్లడించాడు. కౌంటర్ ఫిర్యాదులో ఆ యువతి కుటుంబ సభ్యులు ఇద్దరితో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ కేసులో రెండు పక్షాల ఆరోపణలు తీవ్రంగా ఉండడంతో, ఆధారాలు అనేవి కీలకంగా మారనున్నాయి. అయితే యువతి వాదనలు ఒక వైపు, యశ్ దయాల్ కౌంటర్ ఫిర్యాదు మరోవైపు.. ఈ మధ్యలో అసలు నిజం ఏంటన్నది రానున్న రోజులలో తెలియనుంది. పూర్తి విచారణ అనంతరం నిజనిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.