Homeక్రీడలుWTC Final | తొలి రోజు బౌల‌ర్ల‌దే హ‌వా.. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో ఆసీస్‌దే పైచేయి

WTC Final | తొలి రోజు బౌల‌ర్ల‌దే హ‌వా.. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో ఆసీస్‌దే పైచేయి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: WTC Final | క్రికెట్ మక్కాగా పేరుగాంచిన లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC) ఫైనల్ మ్యాచ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ టైటిల్ గెల‌వాల‌ని రెండు జ‌ట్లు క‌సిగా ఉన్నాయి. అయితే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా జట్టు(South Africa team) రెండు పెద్ద షాకులను ఇచ్చింది. తొలి 10 ఓవర్లలోనే కగిసో రబాడ తన సత్తాను చాటాడు. కగిసో రబాడ ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు క్రీజులో నిలదొక్కుకునే అవకాశం ఇవ్వలేదు. 20 బంతులు ఆడి డకౌట్ అయి పెవిలియన్ చేరాడు. చాలా కాలం తర్వాత మైదానంలోకి తిరిగి వచ్చిన కామెరూన్ గ్రీన్ కూడా బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

WTC Final | బౌల‌ర్ల‌దే పై చేయి..

కగిసో రబాడ(Kagiso Rabada), మార్కో జాన్సెన్ తొలి మూడు ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌లకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. తొలి సెషన్‌లోనే ఆస్ట్రేలియా 67/4 వద్ద కష్టాల్లో పడింది. అయితే స్టీవ్ స్మిత్ (66) – బ్యూ వెబ్‌స్టర్ (72) మధ్య నెల‌కొల్పిన‌ 79 పరుగుల భాగస్వామ్యం ఆసీస్‌ను కొంతవరకు నిలబెట్టింది. కెరీ(23) కూడా ఒక దశలో మద్దతుగా కనిపించినా కొద్ది సేప‌టికి ఔట్ కావ‌డంతో, టీ విరామం తర్వాత ఆసీస్ 212 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక తక్కువ ఓవర్లలో చిన్న లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో మైదానంలోకి దిగిన దక్షిణాఫ్రికాకు తొలి ఓవర్లోనే షాక్ త‌గిలింది. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఐడెన్ మార్కరం డకౌట్(Aiden Marker duck out) అయ్యాడు.

అనంతరం మరో ఓపెనర్ ర్యాన్ రికెల్ట‌న్(Ryan Rickelton) (16) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో డ్రింక్స్ బ్రేక్ సమయానికి 11 ఓవర్లలో 19/2 గా నిలిచింది సఫారీ జట్టు. ఆ తర్వాత హాజిల్ వుడ్, ప్యాట్ కమ్మిన్స్ వ‌రుస వికెట్లు తీసి జట్టును దెబ్బతీశారు. వీరి దెబ్బ‌కు వియాన్ ముల్డర్(Viaan Mulder) (6), ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (2) స్వ‌ల్ప ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరారు. ఇక తొలి రోజు ముగిసే సమయానికి సౌతాఫ్రికా 22 ఓవర్లలో 43/4 వద్ద నిలిచింది. కెప్టెన్ బవూమా(Captain Bavuma) (3), బెడింగ్హామ్ (8) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 169 పరుగుల వెనుకంజలో ఉంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాకు టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన కెప్టెన్సీ రికార్డు ఉంది. బవుమా కెప్టెన్సీలో ఇప్పటివరకు సౌతాఫ్రికా జట్టు ఒక్క టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఓటమి పాలు కాలేదు. బవుమా ఇప్పటివరకు మొత్తం 9 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించగా.. వాటిలో ఆ జట్టు 8 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇప్పుడు ఈ రికార్డును డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా బవుమా కొనసాగించగలుగుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.