అక్షరటుడే, ఇందూరు: World Pneumonia Day | ప్రతి సంవత్సరం నవంబరు 12న ప్రపంచవ్యాప్తంగా “ప్రపంచ న్యుమోనియా దినోత్సవం”గా నిర్వహించుకుంటారు.
ఈ దినోత్సవం ఉద్దేశం.. న్యుమోనియా వ్యాధి తీవ్రత, నివారణ, ముందస్తు చికిత్స అవసరంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం.
న్యుమోనియా అనేది ఊపిరితిత్తులలో బాక్టీరియా, వైరస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే శ్వాసకోశ వ్యాధి. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రాణాపాయకరంగా మారే అవకాశం ఉంటుందని మెడికవర్ హాస్పిటల్స్‌లోని పల్మోనాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ పేర్కొంటున్నారు. వ్యాధి లక్షణాలు, నివారణ గురించి ఆయన వివరిస్తున్నారు.
World Pneumonia Day | న్యుమోనియా లక్షణాలు
అధిక జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి, అలసట. ఈ లక్షణాలను ప్రారంభ దశలో గుర్తించడం, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత ముఖ్యమైనది. సాధారణంగా ఈ వ్యాధి వ్యాక్సినేషన్, శుభ్రమైన వాతావరణం, సరైన పోషకాహారం, శ్రద్ధతో నివారించవచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, న్యుమోనియా ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లల మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంది. కానీ ఇది పూర్తిగా నివారించగలిగిన, చికిత్స చేయగలిగిన వ్యాధి.
అందుకే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లకు లోనుకాకుండా ఉండటం అవసరం.
శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ.. “న్యుమోనియా ఒక సాధారణమైనదే అయినా నిర్లక్ష్యంగా వదిలేస్తే ప్రాణాపాయ పరిస్థితులకు దారితీస్తుంది. వ్యాక్సిన్ తీసుకోవడం, శ్వాసకోశ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యం.” తెలిపారు.
న్యుమోనియాపై అవగాహన పెంపొందించడం అంటే కేవలం రోగాన్ని నివారించడం మాత్రమే కాదు.. సమాజంలోని ప్రతి వ్యక్తి శ్వాస ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా. ఈ ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా మనం మన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకునే సంకల్పంతో ముందుకు సాగుదాం.
