అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Prashant Kishor | బీహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. త్వరలో ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎన్డీఏ, ఇండి కూటమిలతో పాటు జన్ సురాజ్ పార్టీ (Jan Suraj Party) సైతం గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నాయి.
ఎన్నికల వ్యూహకర్త అయిన బీహార్‌కు చెందిన ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) జన్ సురాజ్ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ విరాళాల గురించి ఇటీవల ఇతర పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. దీనిపై తాజాగా ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తాను రెండు గంటలు పని చేసి సలహా ఇచ్చినందుకు రూ.11 కోట్లు తీసుకున్నానని వెల్లడించారు. ఇది బీహార్ కుర్రాడి శక్తి అని ఆయన పేర్కొన్నారు. నిధులను తాను వృత్తిపరమైన ఫీజులతోనే సమకూర్చుకున్నట్లు చెప్పారు. జీఎస్టీ, ఆదాయ పన్ను (GST and income tax) చెల్లించి.. తన సొమ్మును పార్టీకి విరాళం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
Prashant Kishor | ఆయనను అరెస్ట్ చేయాలి
షెల్ కంపెనీల నుంచి జన్ సురాజ్ పార్టీకి విరాళాలు వస్తున్నట్లు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి (Deputy CM Samrat Chaudhary) 1995లో ఓ హత్య కేసులో ఆయన దోషిగా తేలారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అప్పట్లో తాను మైనర్‌నంటూ తప్పుడు పత్రాలు సమర్పించి, శిక్ష నుంచి తప్పించుకున్నారని ఆయన ఆరోపించారు.
Prashant Kishor | 243 స్థానాల్లో పోటీ
బీహార్‌లోని 243 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. జన్ సురాజ్ పార్టీ మొదటి స్థానంలో లేదా చివరి స్థానంలో నిలుస్తుందని ఆయన చెప్పారు. జేడీయూ 25 సీట్ల కంటే తక్కువ స్థానాల్లో గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రతిపక్ష పార్టీల మహాఘటబంధన్ కూటమి మూడో స్థానంలో నిలుస్తుందని చెప్పారు.