అక్షరటుడే, నిజామాబాద్: Sub-Registrar office | రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (sub-registrar offices) అక్రమాలు, అవినీతికి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో ఆన్లైన్ స్లాట్ విధానంలో (online slot system) డాక్యుమెంట్లు జరిగేలా సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది. అయినా పలు కార్యాలయాల్లో మాత్రం అధికారులు, సిబ్బంది తీరు మారట్లేదు. డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడి పనిచేస్తున్నారు. మరికొన్ని కార్యాలయాల్లో ఏకంగా ప్రైవేటు వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లకు కంప్యూటర్ గదుల్లోనే చైర్లు వేయించి మరి అధికారిక పనులు చేయించడం గమనార్హం.
బోధన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో (Bodhan Sub-Registrar office) గత కొంతకాలంగా ప్రైవేటు వ్యక్తులతో అధికారిక పనులు చేయిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు ఈ కార్యాలయంలోనే ఉండి అన్ని రకాల డాక్యుమెంట్ పనులు చక్కదిద్దుతున్నారు. సోమవారం ‘అక్షరటుడే’ (Akshara Today) ప్రతినిధి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లగా సదరు వ్యక్తులు పనులు చక్కబెడుతూ కనిపించారు. వివిధ రకాల సేవల నిమిత్తం వచ్చే ప్రజల నుంచి నేరుగా డాక్యుమెంట్లు తీసుకుని వారే సేవలందించడం ఆశ్చర్యకరం. మరోవైపు కంప్యూటర్లలోనూ ఆన్లైన్లో పనులు చేస్తూ కనిపించారు. ఇంత జరుగుతున్నా కార్యాలయ సబ్ రిజిస్ట్రార్ మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరించడం కొసమెరుపు.
Sub-Registrar office | అక్రమాలకు ఆస్కారం
ప్రభుత్వ ఆఫీసుల్లో (government offices) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఎంతో కీలకమైనవి. వీటిల్లో రోజువారి జరిగే కార్యకలాపాలు, దస్తావేజులు అత్యంత గోప్యంగా ఉంచాల్సినవి ఉంటాయి. కానీ సబ్రిజిస్ట్రార్లు మాత్రం ఇలా ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని మరీ వారితో అధికారిక పనులు చేయించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గతంలో నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం (Nizamabad Urban Sub-registrar office) పరిధిలో నకిలీ డాక్యుమెంట్లు వందలకొద్దీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేటు వ్యక్తులే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో బోధన్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Sub-Registrar office | రూరల్, ఎల్లారెడ్డి కార్యాలయాల్లోనూ..
నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ప్రైవేటు వ్యక్తులు అధికారిక పనులు చక్కబెడుతున్నట్లు సమాచారం. డాక్యుమెంట్లకు సంబంధించిన సేవలు అందించడం, ఆన్లైన్ తదితర పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రైవేటు వ్యక్తులు అన్ని పనులు చక్కబెడుతుండడం చూసి కార్యాలయాలకు వచ్చిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రైవేటు వ్యక్తుల ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో (government offices) పనులు చేయించడంపై నిజామాబాద్ డీఆర్, డీఐజీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.