అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్తో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్, అంగన్వాడీ, ఆస్పత్రులకు సంబంధించిన అసంపూర్తి భవనాలను గుర్తించి పనులను పూర్తి చేయాలన్నారు. చిన్నచిన్న కారణాల వల్ల పెండింగ్లో ఉండకుండా ఒక్కో శాఖ వారిగా మండల ప్రత్యేక అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు. మండల వనరుల కేంద్రం భవనాల నిర్మాణాల కోసం ఇప్పటికే స్థల కేటాయింపులు పూర్తయిన చోట పనులు ప్రారంభించాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల (Indiramma houses) నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ.. నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పనులను ప్రారంభించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను (double bedroom houses) ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన వారికి కేటాయించాలన్నారు.
Nizamabad Collector | ఆయిల్ పామ్ పంటలపై అవగాహన కల్పించాలి..
అధిక లాభాలని అందించే ఆయిల్ పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. నిర్దేశిత లక్ష్యానికి మించి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు (oil palm cultivation) చేపట్టేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. వాటి వల్ల ప్రయోజనాలు, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, గిట్టుబాటు ధర తదితర విషయాలను పై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రతి నివాస ప్రాంతానికి రక్షితమంచి నీరు సరఫరా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.