అక్షరటుడే, ఇందూరు: Intermediate Education | అధ్యాపకులు సమన్వయంతో పనిచేస్తూ మంచి ఫలితాలను సాధించాలని రాష్ట్ర ఇంటర్ బోర్డు (State Inter Board) జిల్లా ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డెన్న ఆదేశించారు.
గురువారం నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను (Government Girls Junior College) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలో చేరిన విద్యార్థుల అభ్యున్నతికి అన్ని సబ్జెక్టుల అధ్యాపకులు కృషి చేయాలన్నారు.
కళాశాల ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నందున యూనిట్ టెస్టులను(Unit tests) నిర్వహించాలని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి శ్రద్ధ వహించాలన్నారు. ఇంటర్ బోర్డు సూచించిన టైం టేబుల్ ప్రకారం తరగతులు నిర్వహించాలని, ప్రతి ఒక్కరు సమయపాలన పాటించాలని ఆదేశించారు.
కళాశాలకు గైర్హాజరయ్యే విద్యార్థుల సమాచారం తల్లిదండ్రులకు అందజేసే ప్రక్రియను ప్రయోగాత్మకంగా జిల్లా నుంచి ప్రారంభించాలని తెలిపారు. అలాగే మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్, ప్రిన్సిపాల్ బుద్దిరాజ్, అధ్యాపకులు ఉన్నారు.