అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | నవీపేట పోలీస్స్టేషన్ (Navipeta Police Station) పరిధిలో ఈనెల 24వ తేదీన మహిళ హత్య జరగగా.. నార్త్ రూరల్ సర్కిల్ పోలీసులు కేవలం 20 గంటల్లోనే కేసును ఛేదించారు. ఈ మేరకు మోస్రాకు చెందిన నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. ఈ మేరకు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి (ACP Raja Venkat Reddy) బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
Nizamabad City | ఇల్లు కుట్టుకునేందుకు డబ్బు కోసం హత్య..
గృహ నిర్మాణానికి డబ్బులు అవసరం కావడంతో నిందితుడు కుమరం అలియాస్ పాండవల సాగర్ తన మేనకోడలు ఆకుల అనంత అలియాస్ సోనీ నగలపై కన్నేశాడు. హత్య చేసి ఆమె వద్ద ఉన్న నగలను తీసుకుంటే ఇంటి నిర్మాణం పూర్తవుతుందని ఆశించాడు. దీంతో ఈనెల 24న ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సందర్భంలో ఆమె ఒంటరిగా ఉండడంతో, ఆమె గొంతు నులిమి హత్య చేసి, చెవులకు ఉన్న కమ్మలు, మాటిలు, మెడలో ఉన్న బంగారు పుస్తెలు తాడు (gold chain) చోరీ చేశారు. అనంతరం మృతదేహాన్ని ఇంటి లోపలి గదిలో దాచి, బంగారంలో కొంత భాగం (కమ్మలు 1.5 గ్రాములు) ముత్తూట్ ఫైనాన్స్ (Muthoot Finance), బోధన్ బస్టాండ్ బ్రాంచ్లో తాకట్టు పెట్టి 12,500 రుణం పొందాడు. మిగిలిన మాటి, పుస్తెలు తాడు (13.5 గ్రాములు) తన వద్దే ఉంచుకున్నాడు.
సంఘటన వెలుగులోకి రాగానే విచారణ చేపట్టిన పోలీసులు పారిపోయిన నిందితుడిని బుధవారం నిజామాబాద్ బస్ స్టేషన్ (Nizamabad bus station) వద్ద నిఘా వేసి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి మిగితా నగలను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి నేతృత్వంలో నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీంలుగా ఏర్పడి కేసును పరిశోధించారు. కేసులో భాగంగా నిందితుడు సాగర్ తండ్రిని సైతం అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్న ఎస్సైలు తిరుపతి, యాదగిరిగౌడ్, గఫార్ తదితరులను సీపీ సాయిచైతన్య అభినందించారు.