అక్షరటుడే, వెబ్డెస్క్ : Guntur | గుంటూరు జిల్లా చేబ్రోలు (Chebrol) మండలం సుద్దపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘటన అందరు ఉలిక్కిపడేలా చేసింది.. ఒక మహిళ తన ప్రియుడిపై ఉన్న కోపంతో అతని ఇంటికే నిప్పంటించడం అందరిని ఆశ్చర్యపరిచింది.
గుంటూరు (Guntur) జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక మహిళ ప్రియుడిపై ఉన్న కోపంతో అతడి ఇంటికే నిప్పంటించడంతో ప్రియుడితో పాటు అతని కుటుంబ సభ్యులు, మంటలు ఆర్పేందుకు వెళ్లిన గ్రామస్థులు కలిపి పది మందికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం, తెనాలి సీఎం కాలనీకి చెందిన దుర్గ (28)కు సుద్దపల్లికి చెందిన మల్లేష్ (30)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది.
Guntur | ఎంతకు తెగించింది..
అయితే ఇటీవల ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్ధలు తలెత్తగా, మల్లేష్ తనను దూరం పెడుతున్నాడనే ఆగ్రహంతో దుర్గ అతడిని ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున పెట్రోల్ తీసుకువచ్చిన దుర్గ ..మల్లేష్ ఇంటికి చేరుకుని ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆ సమయంలో ఇంట్లో మల్లేష్తో పాటు అతని భార్య, కుమారుడు, తల్లి నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాధితులు కేకలు వేయగా, శబ్దం విన్న గ్రామస్థులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో మల్లేష్ కుటుంబ సభ్యులతో పాటు ఆరుగురు గ్రామస్థులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. నిందితురాలు దుర్గకు కూడా మంటలు తాకి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (GGH)కు తరలించగా, మరో ఐదుగురికి వడ్లమూడిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న చేబ్రోలు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.