అక్షరటుడే, కామారెడ్డి: Sadashivnagar | తనకు తెలియకుండా తన సంతకాన్ని ఫోర్జరీ (signature forgery) చేసి బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ నిరసన చేపట్టింది. ఈ ఘటన సదాశివనగర్ (Sadashivnagar) మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేకెళ్లి త్రివేణి 1999 నుంచి మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉంటుంది. గతంలో ఆమె తెలుగులో సంతకం చేసేది. తన సంతకాన్ని ఫోర్జరీ (signature forgery) చేస్తున్నారన్న అనుమానంతో ఇంగ్లిష్లో సంతకం చేస్తోంది. అయితే మూడేళ్ల క్రితం తనకు రుణం అవసరం లేదని చెప్పినా ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రూప్ పేరు మీద రూ.15 లక్షలు రుణం తీసుకున్నారు.
గతంలో ఇదే విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గత నెలలో పీడీకి ఫిర్యాదు చేసింది. అయినా పట్టించుకోకపోతే గత సోమవారం ప్రజావాణిలో (Prajavani) ఫిర్యాదు చేయగా సంఘ సభ్యులను పీడీ పిలిపించారు. ఆ సమయంలో సంతకం ఫోర్జరీ చేసినట్టు సంఘ సభ్యులు ఒప్పుకున్నారని ఆ మహిళ పేర్కొంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తీసుకున్న రుణాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సమాఖ్య భవనం ముందు నిరసనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే కూర్చుంటానని తెలిపింది.
