అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nalgonda | మానవ సంబంధాలు రోజు రోజుకి నశించిపోతున్నాయి. భర్తలు భార్యలని చంపడం, భార్యలు భర్తలని చంపడం, మరోవైపు తల్లులు వివాహేతర సంబంధాల కోసం సొంత పిల్లలని వదిలేసి వెళ్లడం వంటి సంఘటనలు నిత్యం చాలానే చూస్తున్నాం. తాజాగా నల్గొండ (Nalgonda) ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకున్న సంఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఓ తల్లి తన రెండేళ్ల బిడ్డను బస్టాండ్‌లో ఒంటరిగా వదిలేసి, ఓ యువకుడితో బైక్‌పై వెళ్లిపోయిన ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. బిడ్డ ఏడుస్తూ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు పూర్తి సమాచారం ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Nalgonda | ఇంత దారుణమా?
హైదరాబాద్ (Hyderabad)కు చెందిన 25ఏళ్ల మహిళకు నల్గొండకు చెందిన యువకుడితో ఇన్స్టాగ్రామ్ (Instagram) ద్వారా పరిచయం ఏర్పడింది. వారిద్దరూ తరచూ చాట్ చేస్తూ సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. ఆ పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. ప్రియుడిని కలవాలనే ఉద్దేశంతో మహిళ తన ఐదేళ్ల కుమారుడిని తీసుకుని నల్గొండకు వచ్చింది. బస్టాండ్‌కు( Bus Stand) వచ్చిన తర్వాత యువకుడికి ఫోన్ చేసింది. అతడు అక్కడికి చేరుకొని వెంటనే రమ్మని బలవంతం చేశాడు. దీంతో అతనితోనే వెళ్లిపోవాలనుకున్న మహిళకి కన్న బిడ్డ అడ్డంకిగా మారడంతో చిన్నారిని దిక్కులేని అనాథగా బస్టాండ్‌లో ఓ బెంచ్‌పై కూర్చోబెట్టి సదరు యువకుడితో వెళ్లింది.
కొద్ది సేపటికే చిన్నారి ఏడుస్తూ ఉండటాన్ని గమనించిన ప్రయాణికులు, ఆర్టీసీ (RTC) సిబ్బందికి తెలియజేశారు. వారు నల్గొండ టూ టౌన్ ఎస్సై సైదులుకు సమాచారం అందించడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా మహిళను గుర్తించారు. బైక్ నెంబర్ ఆధారంగా యువకుడి వివరాలు సేకరించి, అతడిని, ఆమెను, ఆమె భర్తను స్టేషన్‌కు పిలిపించారు. విచారణలో ఇన్స్టాగ్రామ్ పరిచయం నుంచే ఈ వ్యవహారం మొదలైందని స్పష్టం అయింది. పూర్తి విచారణ అనంతరం పోలీసుల కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే తన కొడుకును తీసుకోవడానికి ఆ తల్లి ఒప్పుకోలేదు. దీంతో చిన్నారిని తండ్రికి అప్పగించారు. పోలీసులు(Police) స్పందించిన తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. తల్లిగా బాధ్యతను మరిచిన మహిళపై నెటిజన్లు, స్థానికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ప్రేమ పేరుతో బంధాలను తాకట్టు పెట్టడం మానవత్వాన్ని మరిచిన చర్య అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.