అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyber Fraud | సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త మార్గంలో అమాయకులను మోసం చేస్తున్నారు. ఫోన్ చేసి మాయమాటలతో మభ్యపెట్టి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే వారు ఎక్కువగా సైబర్ నేరాలకు గురవుతున్నారు. అలాగే గిఫ్ట్‌లు, లాటరీలు వచ్చాయని చెప్పి సైతం సైబర్ నేరస్తులు జేబులకు చిల్లు పెడుతున్నారు. తాజాగా గిఫ్ట్ స్కామ్‌లో ఓ మహిళ మోసపోయింది.
హైదరాబాద్ (Hyderabad)కు చెందిన మహిళకు ఫేస్బుక్ మెసెంజర్లో ఇటీవల ఓ మెసేజ్ వచ్చింది. యూకే(UK)కి చెందిన టోనీ విలియం అనే వ్యక్తిగా నటిస్తూ మోసగాడు తాను ధనవంతుడినని చెప్పుకుని ఆమెతో పరిచయం చేసుకున్నాడు. డైమండ్ రింగ్ (Diamond Ring), బంగారు గొలుసు (Gold Chain) ఉన్న పార్శిల్ పంపుతానని హామీ ఇచ్చాడు. అనంతరం వాటిని పంపానని నమ్మించాడు. అటు తర్వాత కొందరు ఫోన్ చేసి పార్సిల్ కస్టమ్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల నెపంతో డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ఆమె వారి ఖాతాల్లోకి రూ.2.02 లక్షలు జమ చేసింది. అనంతరం మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.
Cyber Fraud | అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల (Cyber Frauds)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరు ఊరికే ఎవరూ గిఫ్ట్‌లు ఇవ్వరని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల సందేశాలకు స్పందించవద్దని సూచించారు. అలాగే ఎవరైనా ఫోన్ చేసి తాము పోలీసులం, జడ్జిలం, కస్టమ్స్ అధికారులమని చెప్పి బెదిరిస్తే భయపడకుండా ఉండాలన్నారు. అధికారులు అలా ఫోన్లు చేయరని చెప్పారు. అలాంటి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయవద్దన్నారు. ఎవరైనా అలా ఫోన్ చేస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి సమాచారం అందించాలని సూచించారు.
1 comment
[…] నేరాల (Cyber Frauds)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని […]
Comments are closed.