అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినా.. బీఆర్ఎస్ (BRS) ఓడిపోయింది. ఈ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఆయన పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఫలితం తమను కొంత నిరుత్సాహ పరిచిందని చెప్పారు. అయినా కూడా తాము కుంగిపోవడం లేదన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నియోజవకర్గంలోని 407 బూత్‌లలో తమ నాయకులు చాలా కష్టపడ్డారని చెప్పారు.
KTR | ప్రత్యామ్నాయం బీఆర్ఎస్
ఎన్నికలకు ముందు ప్రతి సర్వే బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పినట్లు కేటీఆర్ (KTR) తెలిపారు. చివరి మూడు రోజులు ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. అయితే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ఈ ఎన్నికలతో అర్థం అయిందన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఏడు ఉప ఎన్నికలు జరిగితే ఐదు చోట్ల గెలిచామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఒకటి కూడా గెలవలేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections) 2 సీట్లు గెలిచినా.. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఇలాంటివి కామన్ అని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ సోషల్ మీడియా వారియర్ల ఎంతో కృషి చేశారన్నారు.
ఫలితాలతో కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్ సూచించారు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో సక్సెస్ అయ్యామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ (Congress) పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. తమ ప్రచారానికి భయపడి అజారుద్దీన్ (Azaruddin)కు మంత్రి పదవి ఇచ్చారని కేటీఆర్ అన్నారు. ఏది ఏమైనా ప్రజాతీర్పు శిరోధార్యం అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నిరాశపడొద్దని, రబ్బర్ బంతిలా మనం కూడా తిరిగి వస్తామని చెప్పారు. గత రెండేళ్లలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తన పాత్రను అద్భుతంగా పోషించిందన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ను నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.
