అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills by-Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills by-Election) వేళ మద్యం విక్రయాలపై కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని వైన్ షాపులు (Wine Shops), బార్లు, పబ్బులు తదితర మద్యం విక్రయ కేంద్రాలను నాలుగు రోజులపాటు మూసివేయాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని నవంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు. అదనంగా నవంబర్ 14న ఓట్ల లెక్కింపు రోజున కూడా వైన్ షాపులు బంద్ పెట్టనున్నారు.
Jubilee Hills by-Election | కఠిన చర్యలు..
ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20, ప్రజాప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్ 135-C ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతీ (CP Avinash Mohanty) తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో మద్యం విక్రయాలపై నిషేధం విధించడం ద్వారా ప్రలోభాలు, అసాంఘిక చర్యలను అరికట్టడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ రోజున మద్యం ప్రభావంతో జరిగే వివాదాలు, గొడవలను నివారించడంలో ఇది కీలకమని కమిషనర్ స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతి కారణంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11న పోలింగ్, 14న లెక్కింపు జరగనుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ కాంగ్రెస్ (Congress), బీఆర్‌ఎస్ (BRS), బీజేపీ (BJP) మధ్య నెలకొంది. ప్రస్తుతం ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సహా సీనియర్ నేతలు రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల వేడి పెరిగిన నేపథ్యంలో నాయకుల మధ్య పరస్పర ఆరోపణలు, డబ్బు పంపిణీపై ఫిర్యాదులు ఎన్నికల సంఘం దృష్టికి చేరుతున్నాయి. రేసు రసవత్తరంగా సాగే అవకాశం ఉన్నందున ఇప్పుడు ఈ ఉప ఎన్నికపై అందరి దృష్టి పెడుతున్నారు.
