Homeజిల్లాలునిజామాబాద్​Land Grabbing | చర్యలు తీసుకుంటారా.. వదిలేస్తారా..! శిఖం భూమి కబ్జా వ్యవహారం

Land Grabbing | చర్యలు తీసుకుంటారా.. వదిలేస్తారా..! శిఖం భూమి కబ్జా వ్యవహారం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Grabbing | నిజామాబాద్​ నగర శివారులోని సారంగాపూర్​లో ప్రభుత్వ, శిఖం భూమిని కబ్జా చేసిన(Land Grabbing) వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అధికార పార్టీకి చెందిన నేత, మాజీ కార్పొరేటర్(Ex Corporater)​ ఈ భూమిని కబ్జా చేయడం చర్చకు దారి తీసింది. దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే స్థలంలో ఏకంగా హద్దు రాళ్లు పాతి వెంచర్​(Venture) అభివృద్ధి చేయడమే కాకుండా పలు ప్లాట్లను సైతం విక్రయించినట్లు తెలుస్తోంది. సదరు భూమిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు (Revenue Officials ) సర్వే నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కబ్జా వెనుక ఉన్నది అధికార పార్టీ నేత కావడంతో చర్యలు తీసుకుంటారా..? లేకపోతే మామూలుగానే వదిలేస్తారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

సారంగాపూర్​(Sarangapur) శివారులోని సర్వే నంబర్​ 231లో పది ఎకరాల పైచిలుకు శిఖం భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో సైతం స్పష్టంగా శిఖం అని పేర్కొని ఉంది. కాగా ఇదే భూమిపై గతంలో కన్నేసిన కబ్జారాయుళ్లు వెంచర్​ డెవలప్​ చేసి హద్దు రాళ్లు పాతారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో అప్పటి రెవెన్యూ అధికారులు సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. ఈ విషయమై లోకాయుక్తా అధికారులకు మొట్టికాయలు వేసింది. ప్రభుత్వ భూమిని రక్షించడం మీ బాధ్యత కాదా..? అంటూ నిలదీసింది. దీంతో శిఖం భూమి చుట్టూర రక్షణ చర్యలు చేపట్టారు.

Land Grabbing | హద్దు రాళ్లు తొలగించి మరీ కబ్జా

ఒకవైపు లోకాయుక్తా(Lokayukta) మరోవైపు జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆదేశాలతో శిఖం భూమి చుట్టూ రక్షణ హద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని, ఎవరూ కబ్జా చేయొద్దని హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. కానీ, అధికార పార్టీకి చెందిన సదరు నేత ఇవేమీ లెక్కచేయకుండా బరి తెగించాడు. తన బినామీల ద్వారా భూమిని కబ్జా చేయించి ప్లాట్లుగా మార్చేశాడు. అలాగే కొందరు అమాయకులకు సదరు ప్లాట్లను అంటగట్టాడు. దీని వెనక రూ.లక్షలు దండుకున్నట్లు తెలుస్తోంది.

Land Grabbing | విచారణలో నిగ్గు తేలేనా..

శిఖం భూమి కబ్జా వ్యవహారం వెలుగులోకి రావడంతో కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు(collector Rajiv gandhi hanumanth) స్పందించారు. ఎంఐఎం నాయకులు సైతం ఆయనకు ఫిర్యాదు చేయడంతో సత్వరమే విచారణకు ఆదేశించారు. కాగా మంగళవారం సాయంత్రమే ఆర్డీవో, తహశీల్దార్​ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కబ్జా జరిగిందని వాస్తవమేనని ప్రాథమికంగా తేల్చారు. అయితే సాంకేతికపరంగా సర్వే రిపోర్టు కీలకం కానుంది. ఒకటి రెండు రోజుల్లో పూర్తి నివేదిక సిద్ధం కానుంది.

కబ్జా జరిగింది ఎంత మొత్తంలో అనేది పక్కనపెడితే.. ఏకంగా ప్రభుత్వ భూమిని కాజేయాలని చూడటం చట్టప్రకారం నేరం. ఈ నేపథ్యంలో సదరు నేతపై క్రిమినల్​ చర్యలకు సిఫార్సు చేస్తారా..? లేక కబ్జా చేసిన వారు ఎవరో తెలియదని చేతులు దులుపుకుంటారా..? అనేది అతి త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. తిరిగి భూ కబ్జాలు జరగకుండా ఉండాలంటే.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్​పై ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారు.