అక్షరటుడే, వెబ్డెస్క్ : Local Body Elections | వెనుకబడిన సామాజికవర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు గురువారం స్టే విధించింది.
బీసీ రిజర్వేషన్ల(BC Reservations) జీవో చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై రెండ్రోజుల పాటు జరిగిన సుదీర్ఘ వాదనల అనంతరం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతుందన్న దానిపై అందరి దృష్టి నెలకొంది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయిస్తుందా? లేక గత రిజర్వేషన్లను కొనసాగిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందా? అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
Local Body Elections | జీవో, నోటిఫికేషన్ పైనా స్టే..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ(Congress Party) గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకోవాలని ప్రయత్నించింది. ఈ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించింది. అయితే, ఆ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. దీంతో మంత్రిమండలిలో నిర్ణయించి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అది కూడా గవర్నర్ ఆమోదం కోసం పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వమే జీవో నం.49ను జారీ చేసింది. దీని ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. అలాగే గురువారం నోటిఫికేషన్ కూడా జారీ చేయగా, నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. అయితే, జీవోతో పాటు నోటిఫికేషన్ పైనా హైకోర్టు స్టే విధించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న గత సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Local Body Elections | సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం
జీవో నం.9ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం కోర్టులో బలంగా వాదనలు వినిపించింది. అడ్వకేట్ జనరల్ తో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులను సైతం రంగంలోకి దించింది. అయినప్పటికీ, హైకోర్టు(High Court)లో చుక్కెదురైంది. నిబంధనల మేరకే కుల గణన నిర్వహించి, డిడికేషన్ కమిషన్ వేశాకే రిజర్వేషన్లు పెంచినట్లు వాదనలు వినిపించినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తదుపరి ఏం చర్యలు తీసుకుంటుందన్న దానిపై అందరి దృష్టి నెలకొంది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. హైకోర్టు ఉత్వర్వుల కాపీ వచ్చిన తర్వాత ఏం చేయాలనే దానిపై సర్కారు నిర్ణయం తీసుకోనుంది.