అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | కామారెడ్డిని స్టడీ హబ్‌గా (Study Hub) మార్చడానికి తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆర్కే విద్యాసంస్థల గ్రాడ్యుయేషన్ డే (RK Educational Institutions) కార్యక్రమాన్ని శనివారం దేవునిపల్లి లక్ష్మీదేవి గార్డెన్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ అలీ గ్రాడ్యుయేషన్ పూర్తయిన విద్యార్థులకు పట్టాలు అందించారు. వివిధ గ్రూపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పారితోషికం అందజేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విద్యాశాఖను తన వద్ద ఉంచుకొని పర్యవేక్షిస్తున్నారన్నారు. గత పదేళ్లలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందన్నారు. స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ (Fee reimbursement) ఇవ్వలేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రూ.3,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా వాటిని విడుదల చేస్తూ విద్యావ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు.
దేశంలోనే ఎక్కడలేని విధంగా తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ (Telangana Sports University) ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 25 ఎకరాల్లో నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు 60వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఆర్కే కళాశాల విద్యార్థులు కామారెడ్డి పేరును ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేయాలని సూచించారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు సాధించి కామారెడ్డి పేరును నిలబెట్టాలన్నారు.