అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం తేలకపోవడంతో ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు.
హైదరాబాద్(Hyderabad)లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క, ఆ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు(Local Elections) నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో ఈ గడువు పొడిగించాలని ప్రభుత్వం హైకోర్టు(High Court)ను కోరనున్నట్లు సమాచారం. దీనిపై సమావేశంలో చర్చించనున్నారు.
CM Revanth Reddy | బీసీ రిజర్వేషన్లపై..
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతతం రిజర్వేషన్లపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనుట్లు సమాచారం. బీసీ బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంతో ప్రత్యేక జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై సమావేశంలో చర్చించి నిర్ణయం వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా స్థాయిలో రిజర్వేషన్ల జాబితాను సిద్ధం చేశారు. ఈ క్రమంలో రిజర్వేషన్ల(BC Reservations)పై జీవో ఇచ్చి స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
CM Revanth Reddy | వర్షాలపై..
రాష్ట్రంలో వర్షాలపై సైతం సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. భారీ వర్షాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఇదివరకే అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అన్ని కాజ్‌వేలను పరిశీలించి, రోడ్లపై వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందుగానే ట్రాఫిక్‌ను నిలిపివేయాలని సూచించారు.