అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rythu Bharosa | రాష్ట్రంలో యాసంగి సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. పలు జిల్లాల్లో వరి నాట్లు ప్రారంభం అయ్యాయి. అయితే ఇప్పటికి రైతు భరోసా విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ (BRS) హయాంలో తొలుత ఎకరానికి రూ.4 వేలు రైతు బంధు ఇచ్చేవారు. అనంతరం రూ.5 వేలకు పెంచారు. అయితే కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక తొలి సీజన్లో రైతు బంధు రూ.5 వేల చొప్పున జమ చేసింది. అనంతరం తర్వాత సీజన్‌కు రైతు భరోసా జమ చేయలేదు. గత యాసంగి సీజన్లో రైతు భరోసాను ఎకరాకు రూ.6 వేలకు పెంచింది. అది కూడా నాలుగు ఎకరాల్లోపు ఉన్న రైతులకు మాత్రమే విడుదల చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రైతు భరోసా విడుదలపై స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Rythu Bharosa | ప్రకటన చేయని ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం (State Government) వానాకాలం సీజన్లో తొమ్మిది రోజుల్లో రైతు భరోసా జమ చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత సీజన్లో మాత్రమే వేగంగా రైతులకు పెట్టుబడి సాయం అందింది. అందరు రైతులకు నిధులు విడుదల అయ్యాయి. రూ.9 వేల కోట్లను తొమ్మిది రోజుల్లో అన్నదాతల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అయితే ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభం అయినా ఇప్పటి వరకు రైతు భరోసా నిధులపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. దీంతో ఈ సీజన్లో పెట్టుబడి సాయం ఇవ్వదేమోనని రైతులు భావిస్తున్నారు.
Rythu Bharosa | సాగు భూములకే..
రాష్ట్రవ్యాప్తంగా పంటలు సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) ప్రకటించారు. మొత్తం భూములకు పెట్టుబడి సాయం అందిస్తే రూ.9 వేల కోట్లు అవసరం అవుతుంది. సాగు భూములకే అని చెప్పడంతో నిధుల భారం తగ్గించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే సాగు భూములను శాటిలైట్ మ్యాపింగ్ గుర్తించి రైతు భరోసా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. శాటిలైట్ సర్వే (Satellite Survey) అనంతరం నివేదిక వచ్చిన తర్వాతే రైతు భరోసా జమ చేస్తామన్నారు. అయితే ప్రస్తుతం పలు జిల్లాల్లో వరి నాట్లు పూర్తి అయ్యాయి. కొన్ని జిల్లాల్లో ఇప్పుడిప్పుడు తుకాలు పోస్తున్నారు. జనవరిలో నాట్లు వేసే అవకాశం ఉంది. దీంతో ఉపగ్రహ సర్వే ఇప్పట్లో పూర్తి అయ్యే అవకాశం లేదు. సర్వే ఎప్పుడు చేస్తారు, నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఈ సీజన్లో కూడా రైతు భరోసా ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని పలువురు అంటున్నారు.