అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే ఇక్కడి నుంచి పోటీకి బీఆర్ఎస్ (BRS) తన అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీత (Maganti Sunitha)ను ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో దిగనున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నుకునేవారు. అయితే అనంతరం ఈ సంప్రదాయానికి అన్ని పార్టీలు మంగళం పాడాయి. ఉప ఎన్నికలు వస్తే బరిలో నిలుస్తున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ సతీమణి సునీత సానుభూతి ఓట్లతో గెలుస్తారా.. లేదంటే అధికార కాంగ్రెస్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంటుందా.. బీజేపీ సత్తా చాటుతుందా చూడాల్సి ఉంది. అయితే తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి ఎమ్మెల్యే చనిపోతే ఒక్కసారి మాత్రమే వారి కుటుంబ సభ్యులు విజయం సాధించారు. మరి ఈ సారి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.
Jubilee Hills | ఐదు సార్లు ఉపఎన్నిక
తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు చనిపోవడంతో ఐదు సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు విజయం సాధించారు. ఎమ్మెల్యేల మరణంతో వచ్చిన సానుభూతి వారి కుటుంబ సభ్యులను గెలిపించలేకపోయింది.
2016లో పాలేరు (Palair) కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్‌రెడ్డి వెంకట్‌రెడ్డి చనిపోయారు. దీంతో ఆ స్థానం నుంచి ఆయన భార్య పోటీ చేయగా ఓడిపోయారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆ స్థానాన్ని గెలుచుకుంది. 2016లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి మృతి చెందారు. కాంగ్రెస్ నుంచి ఆయన కుమారుడు ఉప ఎన్నికల్లో పోటీ చేయగా అధికార బీఆర్ఎస్ గెలిచింది. 2020లో దుబ్బాక (Dubbaka) ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోయారు. దీంతో బీఆర్ఎస్ ఆ స్థానం నుంచి ఆయన భార్యను బరిలో దింపగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. 2021లో నాగర్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోయారు. ఇక్కడ మాత్రమే ఆయన కుమారుడు బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపొందారు. 2024లో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అక్కడ బీఆర్ఎస్ ఆమె సోదరిని బరిలో దింపగా.. అధికార కాంగ్రెస్ అభ్యర్థి గణేశ్ గెలుపొందారు.
Jubilee Hills | అధికార పార్టీదే పైచేయి
తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి ఎమ్మెల్యేలు చనిపోవడంతో ఐదు సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నాలుగు సార్లు అధికార పార్టీ గెలుపొందింది. ఒక్క దుబ్బాక ఉప ఎన్నికల్లో మాత్రమే అప్పటి బీఆర్ఎస్ ఓడిపోగా.. బీజేపీ గెలిచింది. అలాగే ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో రెండు చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓడిపోగా.. బీజేపీ నుంచి ఈటల గెలిచారు. అలాగే మునుగోడు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ విజయం సాధించింది. మొత్తంగా చూస్తే ఉప ఎన్నికల్లో అధికార పార్టీయే ఎక్కువ సార్లు గెలిచింది. దీంతో ప్రస్తుతం ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.
కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు అక్టోబర్ 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 24 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. నవంబర్ 11న పోలింగ్ జరుగనుండగా, 14వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల కోసం ఈసీ 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.