అక్షరటుడే, వెబ్‌డెస్క్: Danam Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు.
పార్లమెంట్ ఎన్నికల్లో (Parliamentary Elections) సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదు అని చెప్పారు. కానీ తాను మాత్రం కాంగ్రెస్‌లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. స్పీకర్ విచారణ జరుగుతున్న సమయంలో దానం వ్యాఖ్యలకు ప్రాధాన్యత నెలకొంది.
Danam Nagender | కాంగ్రెస్ ఎమ్మెల్యేను..
తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA)నని దానం స్పష్టం చేశారు. జీహెచ్ఏంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్లలో తిరిగి కాంగ్రెస్, ఐఎంఎం తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA)లు కాంగ్రెస్ కండూవా కప్పుకున్నారు. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్‌ను కోరింది. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన స్పీకర్ ఇటీవల ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని తీర్పు చెప్పారు. వారిపై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు.
Danam Nagender | ఉప ఎన్నిక తప్పదా..
మొత్తం పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు మేరకు స్పీకర్ వారికి నోటీసులు ఇచ్చారు. ఇందులో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగతా 8 మంది వివరణ ఇచ్చారు. తాము బీఆర్ఎస్లోనే ఉన్నామన్నారు. ఇటీవల కడియం శ్రీహరి సైతం తాను బీఆర్ఎస్లో ఉన్నానని స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే దానం మాత్రం ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. అయితే దానం కాంగ్రెస్ పార్టీ (Congress Party) తరఫున ఎంపీగా పోటీ చేయడంతో వేటు తప్పదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ముందుగానే ఆయన రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.