ePaper
More
    HomeతెలంగాణBRS chief KCR | కేసీఆర్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేనా?.. నోటీసులు జారీ చేసిన పీసీ ఘోష్...

    BRS chief KCR | కేసీఆర్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేనా?.. నోటీసులు జారీ చేసిన పీసీ ఘోష్ క‌మిష‌న్‌

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: former Chief Minister and BRS chief KCR : మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మెడ‌కు కాళేశ్వ‌రం ఉచ్చు బిగుసుకుంటుందా? రూ.ల‌క్ష కోట్ల‌కు పైగా వెచ్చించి నిర్మించిన అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టు ఆయ‌న రాజ‌కీయ జీవితానికి మ‌చ్చ తేనుందా? కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కాంగ్రెస్ స‌ర్కారు క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మిస్తుందా? ప్ర‌స్తుతం అంద‌రి మ‌దిని తొలుస్తున్న ప్ర‌శ్న‌లు ఇవి.

    కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా క‌ట్టిన బ్యారేజీలు ప‌నికి రాకుండా పోవ‌డం, మూడేళ్ల‌కే మేడిగ‌డ్డ బ్యారేజీకి ప‌గుళ్లు రావ‌డంతో దీనిపై రేవంత్ స‌ర్కారు(Revanth government) విచార‌ణ‌కు ఆదేశించింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు(Kaleshwaram project) నిర్మాణ ప్ర‌ణాళిక‌లు, స్థ‌లాల‌ ఎంపిక‌, ప్రాజెక్టు డీపీఆర్‌లు, నిర్మాణ ప‌నుల్లో నాణ్య‌త‌, నిర్మాణ సంస్థ‌ల‌కు చెల్లింపులు, నాణ్య‌త త‌నిఖీలు వంటి వాటిపై ద‌ర్యాప్తున‌కు గాను జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్‌(Justice PC Ghosh Commission)ను నియ‌మించింది.

    దాదాపు ఏడాదిన్న‌ర‌గా అధికారులు, నిర్మాణ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌ను విచార‌ణ జ‌రిపిన క‌మిష‌న్.. తాజాగా రాజ‌కీయ నిర్ణ‌యాలు తీసుకున్న వారిని విచారించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఇరిగేష‌న్ మంత్రి హ‌రీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌కు నోటీసులు జారీ చేసింది. విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతారా? క‌మిష‌న్ అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానామిస్తారా? అన్న దానిపైనే అంద‌రి దృష్టి నెల‌కొంది.

    BRS chief KCR : రూ.ల‌క్ష కోట్ల‌కు పైగా వ్య‌యం..

    తెలంగాణను కోటి ఎక‌రాల మాగాణిగా మారుస్తామంటూ కేసీఆర్ 2016లో కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం 2008లో రూపొందించిన ప్రాణ‌హిత‌-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో కాళేశ్వ‌రం ప్రాజెక్టును ప్ర‌తిపాదించారు. తుమ్మిడిహెట్టి వ‌ద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగ‌డ్డ‌కు త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించారు. అప్ప‌ట్లో రూ.80.5 వేల కోట్ల అంచ‌నా వ్య‌యంతో 600 మీట‌ర్ల మేర ఎత్తిపోసేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. ఇందుకోసం 80 వేల ఎక‌రాల భూసేక‌ర‌ణ చేశారు.

    కాళేశ్వ‌రంలో అంత‌ర్భాగంగా మూడు బ్యారేజీలు, 15 రిజ‌ర్వాయ‌ర్ల నిర్మాణంతో పాటు 203 కిలోమీట‌ర్ల మేర‌ సొరంగం తవ్వి నీళ్లు త‌ర‌లించాల‌ని ప్ర‌ణాళిక రూపొందించారు. 4,600 మెగావాట్ల విద్యుత్ వినియోగమ‌వుతుంద‌ని అంచ‌నా వేశారు. మొత్తంగా రూ.ల‌క్ష కోట్ల‌కు పైగా వెచ్చించి ప్ర‌పంచంలోనే అత్య‌ద్భుత‌మైన ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి కేసీఆర్ శ్రీ‌కారం చుట్టారు. వివిధ ద‌శ‌ల్లో నీళ్ల‌ను ఎత్తిపోస్తూ వంద‌లాది కిలోమీట‌ర్లు త‌ర‌లించేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించారు.

    BRS chief KCR : మూన్నాళ్ల ముచ్చ‌ట‌!

    మేడిగ‌డ్డ‌, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల‌ను నిర్మించి క‌రువు ప్రాంతాల‌కు నీళ్లు త‌ర‌లించే ప‌నులు చేప‌ట్టారు. అయితే, క‌ట్టిన మూడేళ్ల‌కు మేడిగ‌డ్డ ప్రాజెక్టుకు ప‌గుళ్లు వ‌చ్చాయి. మ‌హారాష్ట్ర వైపు ఉన్న 19, 20, 21 బ్లాక్‌ల‌లో పియ‌ర్స్ దెబ్బ తిన్నాయి. వ‌ర‌ద ప్ర‌వాహానికి భూగ‌ర్భంలో నిర్మించిన సీకెంట్ ఫైల్స్ క‌దిలి ప‌గుళ్లు వ‌చ్చిన‌ట్లు ఇంజినీర్లు మొద‌ట్లోనే గుర్తించినా అప్ప‌టి ప్ర‌భుత్వం పెద్ద‌గా స్పందించ‌లేదు.

    అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక మేడిగ‌డ్డ ప్రాజెక్టు దుస్థితి బ‌య‌ట‌కొచ్చింది. వ‌ర‌ద దాటికి పిల్ల‌ర్ల‌కు ప‌గుళ్లు రావ‌డంతో మొన్న‌టి సీజ‌న్‌లో నీళ్లు నిలిపి ఉంచ‌లేదు. మేడిగ‌డ్డ‌తో పాటు సుందిళ్ల‌, అన్నారం బ్యారేజీల ప‌రిస్థితిపై రేవంత్ స‌ర్కారు.. నేష‌న‌ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఎల్‌) నివేదిక కోరింది.

    నీళ్లు నిలిపితే బ్యారేజీలు కొట్టుకుపోయే పెను ప్ర‌మాదం త‌లెత్తే అవ‌కాశ‌ముందన్న ఎన్‌డీఎస్ఎల్ నివేదిక‌తో మొన్న‌టి సీజ‌న్‌లో నీళ్లు నిలిపి ఉంచ‌లేదు. అస‌లు క‌ట్టిన మూడేళ్లకే కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఎందుకిలా త‌యారైంద‌న్న అంశంపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది.

    BRS chief KCR : సుదీర్ఘ‌ విచార‌ణ‌..

    కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణ వైఫ‌ల్యంపై ఏర్పాటైన జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ దాదాపు ఏడాదిన్న‌ర‌గా విచార‌ణ జ‌రుపుతోంది. మొద‌ట్లో ఆర్నెళ్ల వ్య‌వ‌ధితో ఏర్పాటైన క‌మిష‌న్ గ‌డువును ప్ర‌భుత్వం విడుత‌ల వారీగా పొడిగించింది. ఈ నేప‌థ్యంలో ప్రాజెక్టు నిర్మాణంలో భాగ‌స్వాములైన ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ‌ల ప్ర‌తినిధులు, ఆడిట‌ర్లు స‌హా అనేక మందిని విచారించింది.

    కమిషన్ విచారణలో భాగంగా బ్యారేజీ నిర్మాణంలో పని చేసిన ఏఈలు, డీఈలు, ఎస్‌ఈలతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులందరినీ కమిషన్ విచారించింది. వారి నుంచి అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలాన్ని స్వీకరించి.. వాటిని క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో పాటు బహిరంగంగా విచారించింది. ప్రాజెక్టులను నిర్మించిన కంపెనీల ప్రతినిధులను కూడా విచారించింది. క‌మిష‌న్ విచార‌ణ గ‌డువు ఈ నెలాఖరుతో ముగియనుండ‌గా ప్ర‌భుత్వం మ‌రో నెల‌లు పొడిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

    BRS chief KCR : రాజ‌కీయ బాస్ నిర్ణ‌యం మేర‌కే..

    ఇంజినీర్లు, నిర్మాణ కంపెనీల ప్ర‌తినిధులు, ఆడిట‌ర్లు, వివిధ శాఖ‌ల క‌మిష‌న‌ర్లు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు స‌హా అంద‌రినీ క‌మిష‌న్ విచారించింది. ప్రాజెక్ట్ డిజైన్లు చేసిన కంపెనీల ప్రతినిధులను కూడా కమిషన్ ఎంక్వైరీ చేసింది. అంద‌రి వాంగ్మూలాల‌ను అఫిడ‌విట్ల రూపంలో సేక‌రించి, క్రాస్ ఎగ్జామినేష‌న్ కూడా చేసింది. ఈ నేప‌థ్యంలో ప్రాజెక్టు నిర్మాణ స్థ‌లాల ఖ‌రారు, కాంట్రాక్టుల అప్ప‌గింత‌, నిధుల విడుద‌ల త‌దిత‌ర అంశాల‌పై లోతుగా విచారించింది. ఈనేప‌థ్యంలో ప్రాజెక్టు రూప‌క‌ల్ప‌న మొద‌లు నుంచి నిర్మాణం వ‌ర‌కు అప్ప‌టి ప్ర‌భుత్వ పెద్ద‌ల మేర‌కే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అధికారులు క‌మిష‌న్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. దాదాపు అందరూ కూడా అప్ప‌టి ముఖ్య‌మంత్రి పేరే చెప్పినట్లు తెలుస్తోంది.

    బ్యారేజీకి సంబంధించిన స్థలాల ఎంపికను ఎవరు చేశారని ప్రశ్నించగా.. ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరునే ప్రస్తావించినట్లు సమాచారం. స్థలాల ఎంపిక, బ్యారేజీలకు సంబంధించి కీలక నిర్ణయాలు, చెల్లింపుల నిర్ణయాల్లో కూడా ఆనాటి సీఎం కేసీఆర్, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రమేయంతో జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వచ్చినట్లు స‌మాచారం.

    BRS chief KCR : కేసీఆర్‌కు నోటీసులు..

    విచార‌ణ‌లో అధికారులు, కాంట్రాక్ట‌ర్లు, ఆడిట‌ర్లు ప్ర‌తి ఒక్క‌రూ అప్ప‌టి ప్ర‌భుత్వ పెద్ద‌ల నిర్ణ‌యం మేర‌కే ప‌ని చేశామ‌ని చెప్ప‌డంతో క‌మిష‌న్‌.. కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉన్న వారికి విచారించాల‌ని నిర్ణ‌యించింది. అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ మంగ‌ళ‌వారం నోటీసులు జారీ చేసింది. జూన్‌ 5 లోపు కమిషన్ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆయ‌న‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు సైతం కమిషన్ నోటీసులు జారీ చేసింది.

    ప్రాజెక్టు ప్ర‌తిపాద‌న‌ల నుంచి నిర్మాణం పూర్త‌య్యే వ‌ర‌కూ అన్నీ తానై వ్య‌వ‌హరించిన కేసీఆర్‌ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయకుండా నివేదిక ఇస్తే బీఆర్‌ఎస్ తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని భావించిన కమిషన్.. కేసీఆర్‌ను స్వయంగా విచారించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే కేసీఆర్‌ సహా హరీశ్‌, ఈటలకు నోటీసులు పంపించింది.

    జూన్ 5లోపు వీళ్లు కమిషన్ ముందు హాజరై కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిగా జస్టిస్ పీసీ ఘోష్ నోటీసుల్లో పేర్కొన్నారు. జూన్ 5 లోపు వాళ్లు ఎంచుకున్న తేదీ అయినా లేదా కమిషన్ నిర్ణయించిన తేదీల్లో విచారణ హాజరుకావాల్సిందిగా నోటీసులు తెలియజేశారు. అయితే కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేక న్యాయపరంగా ఎదుర్కొంటారా? అన్న‌ది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...