అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Kavitha | బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ ఉద్యమంతో జాతీయ స్థాయిలో గులాబీ పార్టీకి మంచి పేరుంది.
ఈ నేపథ్యంలో సొంత బిడ్డనే కేసీఆర్(KCR) సస్పెండ్ చేయడం జాతీయ స్థాయిలోనూ ఆసక్తికర చర్చకు దారి తీసింది. కొన్నాళ్లుగా పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్న జాగృతి వ్యవస్థాపకురాలిపై పార్టీ వేటు వేసిన నేపథ్యంలో ఆమె భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. కవిత(MLC Kavitha) ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై రాజకీయ వర్గాల్లో జెరుగా చర్చ సాగుతోంది. కొత్త పార్టీ పెడతారా.. లేక వేరే పార్టీలో చేరతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. కవిత కొత్త పార్టీ పెడితే అంతిమంగా ఎవరికి నష్టం జరుగుతుందన్నది కూడా చర్చనీయాంశమైంది.
MLC Kavitha | ఎందుకిలా..
బీఆర్ఎస్ రజతోత్సవాల(BRS Silver Jubilee) తర్వాత పార్టీలో గూడుకట్టుకున్న అసంతృఫ్తి భగ్గుమన్నది. చాలాకాలంగా అంతర్గతంగా రగిలిపోతున్న కవిత రజతోత్సవ సభపై తన తండ్రి కేసీఆర్‌కు సంధించిన లేఖ బయటకు రావడం కలకలం రేపింది. ఆ తర్వాత పలుమార్లు బహిరంగంగానే బీఆర్ ఎస్ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు. తనపై కుట్రలు పన్నారని పార్టీలో ప్రాధాన్యం దక్కకుండా చేశారని, ఎంపీ ఎన్నికల్లో కావాలనే ఓడించారని ఆరోపణలు చేశారు. అటు పరోక్షంగా కేటీఆర్‌పైనా విమర్శలు చేసిన కవిత.. తాజాగా హరీశ్‌రావు(Harish Rao), సంతోష్‌రావు(Santosh Rao)లపై సంచలన వ్యాఖ్యలు చేశరు. అవినీతి ఆనకొండలని, కాళేశ్వరంలో జరిగిన వ్యవహారాలన్నింటికీ వారే కారణమని ఆరోపించారు. కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైరీ(CBI Inquiry) వేశాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత? అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేసీఆర్ సొంత బిడ్డను పార్టీ నుంచి సస్పెండ్ సంచలన నిర్ణయం ప్రకటించారు.
MLC Kavitha | భవిష్యత్ కార్యాచరణ ఏమిటో?
ప్రస్తుతం బీఆర్ ఎస్ నుంచి వెళ్లగొట్టబడిన కవిత తీసుకునే నిర్ణయంపై అందరి చూపు నెలకొంది. రాజకీయంగా బలమైన ఆకాంక్షలు ఉన్న ఆమె తదుపరి అడుగులు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది. జాగృతి ద్వారా ఇప్పటికే సొంత సంస్థను నడుపుతున్న ఆమె.. ఇప్పుడు కొత్త పార్టీ పెడతారా? లేక వేరే పార్టీలో చేరతారా? అన్నది చర్చనీయాంశమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత అటు బీజేపీతో పాటు కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తనను జైలు పాలు చేసిన బీజేపీ అంటేనే నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కాషాయం గూటికి చేరకపోవచ్చన్న భావన నెలకొంది. ఇక, కాంగ్రెస్ వైపు కూడా ఆమె ఆసక్తి చూపించక పోవచ్చన్న వాదన వినిపిస్తోంది. కవిత ధిక్కార స్వరం వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఉన్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నప్పటికీ, ఆమె కూడా సీఎంను విమర్శించడంలో ఎక్కడా తగ్గడం లేదు. మరోవైపు, ఆమెను పార్టీలో చేర్చుకునే ఉద్దేశం లేదని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మంగళవారం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కవిత కొత్త పార్టీ ఏర్పాటు వైపే మొగ్గు చూపే అవకాశముంది.
MLC Kavitha | పార్టీ నడపడం సాధ్యమేనా…?
తెలంగాణ(Telangana)లోనే కాదు, జాతీయ స్థాయిలోనూ కవితకు మంచి గుర్తింపు ఉంది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఆమె తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీలో అనర్గళంగా మాట్లాడగలరు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, బీఆర్‌ఎస్ పాలనలోనూ కవిత తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె కేసీఆర్ వారసురాలిగానే కాకుండా జాగృతి ద్వారా సొంతంగా ఎదిగారు. కనుమరుగై పోతున్న బతుకమ్మను బతికించిన నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకనాడు తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ విశిష్టతను విశ్వవ్యాప్తం చాటి చెప్పి కవిత ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. కొంతకాలంగా బీసీ పాట పాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా గొంతు వినిపిస్తున్న కవిత కొత్త పార్టీ పెడతారన్న వాదన వినిపిస్తోంది. అయితే, అది మనుగడ సాగిస్తుందా? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఎదుగుతుండగా, బీఆర్ ఎస్ క్రమంగా పట్టు కోల్పోతోంది. మరోవైపు కనుమరుగయ్యే స్థితి నుంచి కోలుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో మళ్లీ బలం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్న కవిత ఏమేరకు మద్దతు దక్కుతుందన్నది కాలమే నిర్ణయిస్తుంది.