అక్షరటుడే, వెబ్డెస్క్ : Insurance Policy | వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం బీమా ప్రీమియంలపై 18శాతం జీఎస్టీ(GST) భారం పడుతోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ మినహాయింపు అన్నది ఓ రకంగా పాలసీ హోల్డర్ల(Policy holders)కు గుడ్ న్యూసే.. అయితే జీఎస్టీ ఎత్తేస్తే ప్రీమియం పెంచే అవకాశాలు ఉంటాయని ఇన్సూరెన్స్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పాలసీదారులకు పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేంద్ర ప్రభుత్వం(Central government) గతంలో సంక్లిష్టంగా ఉన్న వివిధ రకాల పనులను ఏకీకృతం చేసి వాటి స్థానంలో జీఎస్టీని తీసుకువచ్చింది. వివిధ స్లాబ్‌లను అమలు చేస్తోంది. అయితే కొన్ని రకాల వస్తువులు, సేవలపై జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. ఇందులో ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ ప్రధానమైనది. ఈ నేపథ్యంలో ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ(Prime minister Modi) జీఎస్టీ విషయంలో సంస్కరణలు తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీంతో ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ పూర్తిగా ఎత్తేయడం గాని, 5 శాతానికి తగ్గించడం గాని చేస్తారని ఆశిస్తున్నారు. ప్రస్తుతం బీమా ప్రీమియంలపై 18శాతం జీఎస్టీ విధిస్తున్నారు. 13 మంది రాష్ట్ర మంత్రుల బృందం (Group of Ministers) ఇన్సూరెన్స్ అంశంపై బుధవారం చర్చించింది. బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు విషయంలో చాలా రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Insurance Policy | రూ. 85 వేల కోట్లు లాస్..
జీఎస్టీ స్లాబ్‌లు మారిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు(Governments) భారీగా ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్(SBI research report) ప్రకారం జీఎస్టీ స్లాబ్ రేట్లు తగ్గిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి రూ.85 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోనున్నాయి. కాగా ఒక్క ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ ఎత్తేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 9,700 కోట్ల ఆదాయం తగ్గనుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, యూఎస్ టారిఫ్‌ల(US tariffs) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు పన్నులు తగ్గించాలన్న యోచనతో ఉంది.
Insurance Policy | ప్రీమియం పెరగనుందా?
ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ ఎత్తేస్తే ప్రీమియం తగ్గుతుందని అందరూ ఆశిస్తున్నారు. అయితే విచిత్రంగా ప్రీమియం పెరిగే అవకాశాలున్నాయని ఇన్సూరెన్స్ రంగ నిపుణులు పేర్కొంటుండడం గమనార్హం. ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించడం గానీ, పూర్తిగా ఎత్తేయడం గానీ చేస్తే కంపెనీలు వాటిపై ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందలేవంటున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేట్లలో పొందుతున్న టాక్స్ క్రెడిట్ నిలిచిపోతుంది. ఇది కంపెనీల ఆదాయాలపై ప్రభావం చూపుతుందని
ఇన్సూరెన్స్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే జీఎస్టీని తగ్గిస్తే లాభాలు తగ్గకుండా చూసుకునేందుకు బీమా కంపెనీలు ప్రీమియంలను పెంచే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.