అక్షరటుడే, వెబ్‌డెస్క్: Raja Singh | హిందుత్వం కోసం తన పోరాటం కొనసాగిస్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఆయన పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) శుక్రవారం రాజాసింగ్ రాజీనామాను ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన స్పందించారు. తన రాజీనామా ఆమోదంపై కార్యకర్తలు బాధపడొద్దన్నారు.
Raja Singh | ఆ విషయంలో విఫలమయ్యాను..
బీజేపీలో తాను 11 ఏళ్ల క్రితం ఒక కార్యకర్తగా చేరినట్లు రాజాసింగ్ చెప్పారు. తనపై పార్టీ విశ్వాసంతో మూడు సార్లు టికెట్ ఇచ్చిందన్నారు. గోషామహల్ (Gosha Mahal) ప్రజల ఆశీర్వాదంతో మూడు సార్లు గెలుపొంది ప్రజాసేవ చేసినట్లు పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని లక్షలాది మంది కార్యకర్తలు భావిస్తున్నారన్నారు. వారి గొంతును ఢిల్లీకి తీసుకు వెళ్లడంతో తాను విఫలమైనట్లు ఆయన పేర్కొన్నారు. తన రాజీనామా వెనక ఉన్న ఆవేదనను పార్టీ పెద్దలు గుర్తించలేదన్నారు.
Raja Singh | కార్యకర్తలతో చర్చించి నిర్ణయం
తాను బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress)లో చేరుతానని ప్రచారం జరుగుతోందని రాజాసింగ్ అన్నారు. అయితే ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కార్యకర్తలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తాను ఏ పదవులు లేనప్పుడే దేశద్రోహులపై పోరాటం చేశానన్నారు. ఇకపై కూడా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. హిందుత్వ కోసం, గోమాత రక్షణ కోసం, లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నారు. తనకు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన బీజేపీ(BJP)కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.