అక్షరటుడే, ఇందూరు : Rice Mills | సీఎంఆర్ అప్పగించడంతో రైస్‌మిల్లర్లు (Rice millers) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల (purchase centers) ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి రైస్ మిల్లులకు ఇస్తోంది.
ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే చాలా రైస్‌మిల్లులు బియ్యం అప్పగించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. గడువు దాటినా బియ్యం ఇవ్వడం లేదు. ఇప్పటికీ రూ.కోట్ల సీఎంఆర్ బకాయిలు (CMR dues) ప్రభుత్వానికి కట్టాల్సి ఉన్నా.. ఏమాత్రం స్పందించడం లేదు.
జిల్లాలో సీఎంఆర్ బకాయిలు రూ.కోట్లలో ఉన్నాయి. సుమారు 48 మంది రైస్ మిల్లర్లు రూ.250 కోట్లు ప్రభుత్వానికి కట్టాల్సి ఉంది. అయితే వీరిలో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో రికవరీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయినా గత పదేళ్లగా బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లపై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.
రెవెన్యూ రికవరీ యాక్ట్ (Revenue Recovery Act) ప్రకారం బకాయిలను రికవరీ చేయాలని మంత్రులతో పాటు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ రికవరీ చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2024-25 వానకాలం సీజన్‌కు సంబంధించి 40 శాతం, యాసంగికి సంబంధించి 30 శాతం సీఎంఆర్ మాత్రమే ఇప్పటివరకు అందింది. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అందించాల్సిన సీఎంఆర్ రైస్ (CMR rice) విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
Rice Mills | చర్యలు కరువు
ప్రతి సీజన్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు కేటాయిస్తుంది. క్వింటాకు 67 కిలోల బియ్యం తిరిగి సీఎంఆర్ రూపంలో ప్రభుత్వానికి మిల్లర్లు అప్పగించాల్సి ఉంటుంది. రెండేళ్ల క్రితం యాసంగికి (Yasangi) సంబంధించిన సీఎంఆర్ ఇప్పటికీ కొందరు రైస్ మిల్లర్లు పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి ఇవ్వలేదు. పలుమార్లు గడువు పెంచి ఈ ఏడాది జూన్‌లోగా అప్పగించాలని చెప్పినా మిల్లర్లు పెడచెవిన పెట్టారు. రూ.కోట్లలో బకాయిలు ఉండటంతో ఇన్‌ఛార్జి మంత్రులు, కలెక్టర్ సైతం రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా రికవరీ చేయాల ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు.
Rice Mill | పదేళ్ల నుంచి బకాయిలు
జిల్లాలోని పదుల సంఖ్యలో రైస్ మిల్లర్లు గత పది ఏళ్ల నుంచి సీఎంఆర్ బకాయిలు ఉన్నారు. 2014-15 నుంచి 2022-23 వరకు సుమారు 40 రైస్ మిల్లర్లు రూ.200 కోట్లకు పైగా కట్టాల్సి ఉంది. హైకోర్టు (High Court) ఆదేశాలతో కేసులు నమోదు చేసినా.. తదుపరీ విచారణ చర్యల విషయంలో అధికారులు ముందుకు వెళ్లడం లేదు.
ఈ అంశంలో గతంలో అప్పటి జిల్లా పౌరసరఫరాల అధికారిపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. ఇదిలా ఉండగా బోధన్‌కు (Bodhan) చెందిన మాజీ ప్రజా ప్రతినిధికి చెందిన నాలుగు రైస్ మిల్లులకు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ మిల్లులో ధాన్యాన్ని మిల్లింగ్ చేయకపోగా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం సుమారు రూ.10 కోట్ల జరిమానా కూడా విధించింది. ఇప్పటివరకు సీఎంఆర్ ఇవ్వకపోగా జరిమానా సైతం కట్టలేదు.