అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Azharuddin | మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ మంత్రి పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తారని, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ నాయకులు ఎన్నికల సంఘానికి (Election Commission) ఫిర్యాదు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) జూబ్లీహిల్స్ స్థానం నుంచి అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో సైతం తనకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరారు. అయితే కాంగ్రెస్ మాత్రం నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపింది. అంతకు ముందే అజారుద్దీన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అయితే దీనికి ఇంకా గవర్నర్ ఆమోదించలేదు. కాగా.. జూబ్లీహిల్స్‌లో మైనారిటీ ఓట్లు అధికంగా ఉండడంతో.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ (Congress) సిద్ధమైనట్లు సమాచారం.
Azharuddin | బీజేపీ ఆగ్రహం
మంత్రివర్గ విస్తరణ వార్తలపై బీజేపీ (BJP) ఆగ్రహం వ్యక్తం చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక వర్గం ఓట్ల కోసం ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించి అజారుద్దీన్‌కు కేబినెట్లోకి తీసుకుంటున్నారని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గురువారం ఎన్నికల సంఘానికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (BJP MLA Payal Shankar) ఫిర్యాదు చేశారు. ఇలాంటి ప్రకటనలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని, ఓటర్లను ప్రభావితం చేసే దుష్ప్రయత్నంగా పేర్కొంటూ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఈ అనైతిక చర్యలను తక్షణమే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఎన్నికల కోడ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పరిమితం. అయినా కూడా.. తాజా నిర్ణయంతో ఆ నియోజకవర్గంలోని ఓటర్లు ప్రభావితం అవుతారని బీజేపీ వాదిస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

