అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nizamabad DEO | ‘‘తాను నిబంధనల ప్రకారమే పని చేస్తానని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే సహించేది లేదని’’ నిజామాబాద్ డీఈవో అశోక్ (DEO Ashok) చెప్పుకొస్తున్న మాట. కానీ సొంత కార్యాలయంలో పలువురు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడిన ఉదంతాలు ఎన్నో. అలాగే పలువురు ఉపాధ్యాయులు బడులకు వెళ్లకుండా డుమ్మా కొడుతున్న ఘటనలు మరెన్నో. ఓ ఉపాధ్యాయుడు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేకు పీఏగా (PA) ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం డీఈవో నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కాగా.. ఈ ఉదంతంపై విచారణ మొదలు పెట్టిన డీఈవో ఇకనైనా చర్యలు తీసుకుంటారా.. లేకుంటే మొక్కుబడిగా మమ అనిపిస్తారా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు (Govt Teachers) డిప్యుటేషన్లు, వర్క్ ఆర్డర్ల పేరిట ఇతర చోట్ల పనిచేయడంపై నిషేధం ఉంది. ముఖ్యంగా విద్యా హక్కు చట్టం, సుప్రీంకోర్టు (Supreme Court) మార్గదర్శకాలను అనుసరించి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గానీ టీచర్లను పీఏలుగా (వ్యక్తిగత సహాయకులు) నియమించుకోవడానికి వీలు లేదు. కానీ నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో అందుకు విరుద్ధంగా ఓ ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి (MLA Bhupathi Reddy) పీఏగా కొనసాగుతున్నాడు. గతంలో భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఇలాగే నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన సదరు టీచర్.. తిరిగి భూపతి రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి అదే కుర్చీలో కొనసాగుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో మరేచోట కూడా ఉపాధ్యాయులు పీఏలుగా వ్యవహిస్తున్న దాఖలాలు లేవు. ఒకవైపు వ్యక్తిగత సెలవులు పెట్టడం, మరోవైపు అధికారికంగానే ఎమ్మెల్యేకు పీఏగా వ్యవహరించడం అంతా విద్యాశాఖ అధికారుల కనుసన్నల్లోనే కొసమెరుపు.
Nizamabad DEO | ఒకే వేదిక పంచుకున్నా..
ప్రస్తుత డీఈవో అశోక్‌కుమార్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, జిల్లా స్థాయిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా.. అదే వేదికపై డీఈవో అశోక్‌తో పాటు శ్రీనివాస్‌రెడ్డి రూరల్ ఎమ్మెల్యే పీఏగా పాల్గొన్నారు. చాలా సందర్భాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరిపారు. కాగా.. ఇవేమీ తమకు తెలియదన్నట్లు ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి అధికారికంగా సెలవులో ఉన్నట్లు డీఈవో అశోక్ తప్పించుకునే ధోరణిలో వ్యవహరించడం గమనార్హం. మరోవైపు ఎంఈవో సైతం ‘జీవోల’ శ్రీనివాస్‌రెడ్డికి అన్ని విధాలా అండదండలు అందిస్తున్నట్లు వినికిడి.
Nizamabad DEO | విచారణలో ఏం తేలిదంటే?
ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి అధికారికంగా సెలవులు పెట్టి ఎమ్మెల్యే భూపతిరెడ్డి వద్ద పీఏగా వ్యవహరిస్తుండడంపై కలెక్టర్ సహా విద్యా శాఖకు వరుస ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు డీఈవో అశోక్ ప్రాథమిక విచారణ జరిపించినట్లు సమాచారం. కాగా.. గత కొద్ది నెలలుగా శ్రీనివాస్‌రెడ్డి అనధికారిక సెలవులో ఉంటున్నట్లు ప్రాథమికంగా తేలింది. అయితే గతం నుంచి అనధికారికంగా సెలవులో ఉంటున్నా.. జీతభత్యాలు చెల్లించినట్లు సమాచారం. మొత్తం వ్యవహారంలో డీఈవో, ఎంఈవో ఉపాధ్యాయుడిగా, పీఏగా కొనసాగడానికి అన్ని విధాలా అండదండలు అందించినట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయిన నేపథ్యంలో శ్రీనివాస్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
