అక్షరటుడే, కామారెడ్డి: Rajampet | తనతో తరచుగా గొడవ పడుతూ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త అడ్డును తొలగించుకోవాలని ఓ భార్య పన్నాగం పన్నింది. ఆలోచన వచ్చిందే తడవుగా ప్రియుడితో ఈ విషయాన్ని పంచుకుంది. ఇద్దరు కలిసి పథకం ప్రకారం భర్తను హత్య చేయగా ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ కామారెడ్డి కోర్టు (Kamareddy court) తీర్పునిచ్చింది.
Rajampet | వివరాల్లోకి వెళ్తే..
రాజంపేట మండల (Rajampet mandal) కేంద్రానికి చెందిన గంగుల లింగం 2023 ఏప్రిల్ 22న అదృశ్యమైనట్లు ఆయన భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 23న పోలీసుల విచారణలో లింగం తరచుగా గ్రామ శివారులో ఉన్న సిద్ధుల గుట్ట వద్ద మద్యం సేవిస్తాడని తెలియగా పోలీసులు వెళ్లి చూడటంతో ఒంటిపై గాయాలతో లింగం హత్యకు గురై కనిపించాడు. అదే గ్రామానికి చెందిన శంకరిగారి గోవింద్ పొలంలో కూలీ పనులకు లింగం, అతని భార్య వెళ్లేవారని, ఈ పరిచయం కాస్తా లావణ్య, గోవింద్ మధ్య అక్రమ సంబంధానికి దారి తీసిందని పోలీసుల విచారణలో తేలింది.
Rajampet | తరచూగా గొడవలు జరుగుతుండడంతో..
లింగం, లావణ్య మధ్య తరచుగా గొడవలు జరుగుతుండటంతో లింగంను హత్య చేయాలని లావణ్య భావించింది. ఈ విషయాన్ని గోవిందుకు చెప్పగా పథకం ప్రకారం ఏప్రిల్ 21న గోవింద్ లింగంను తీసుకుని కామారెడ్డికి (Kamareddy) వెళ్లి అతిగా మద్యం తాగించాడు. అనంతరం జనాలు తిరగని దారిలో బైక్పై గ్రామ శివారులో ఉన్న సిద్ధుల గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే కత్తితో లావణ్య దాక్కుని ఉంది. లింగంను ఇద్దరు కలిసి వెనక నుంచి దాడిచేసి గొంతుకోసి హత్య చేశారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాలు కోర్టులో సమర్పించగా లావణ్య, ఆమె ప్రియుడికి జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ తీర్పునిచ్చారు.