అక్షరటుడే, వెబ్‌డెస్క్: Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో (boyfriend) కలిసి తన భర్తను అతికిరాతకంగా హత్య చేసింది. అనంతరం తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సంభాల్ జిల్లా (Sambhal district) చందౌసిలో ఒక మహిళ తన ప్రియులతో కలిసి తన భర్తను హత్య చేసింది. అతని శరీరాన్ని ముక్కలుగా నరికి, ఆ భాగాలను వేర్వేరు ప్రదేశాలలో పారవేసింది. పాలిథిన్ సంచులలో (polythene bags) ప్యాక్ చేసిన శరీర భాగాలు లభ్యం కావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది, ఈద్గా సమీపంలో.. ఈ భయంకరమైన సంఘటన డిసెంబర్ 15న చందౌసిలోని పట్రౌవా రోడ్డులోని ఈద్గా సమీపంలో వెలుగుచూసింది. అనుమానాస్పద పాలిథిన్ సంచులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు వాటిని తెరిచి చూడగా మానవ శరీర భాగాలు కనిపించాయి. శరీరాన్ని అత్యంత క్రూరంగా నరికినట్లు, తల, చేతులు, కాళ్లు వేరు చేయబడినట్లు పోలీసులు తెలిపారు.
Uttar Pradesh | టాటూ ఆధారంగా..
మృతదేహాన్ని ముక్కలుగా చేయడంతో గుర్తు పట్టడం పోలీసులకు కష్టం అయింది. అయితే చేతిపై టాటు ఆధారంగా పోలీసులు మృతుడిని గుర్తించారు. చేతిపై రాహుల్ అనే పేరు ఉండటంతో పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు చందౌసిలోని చున్నీ ప్రాంతానికి చెందిన షూ వ్యాపారి రాహుల్ (40) అని గుర్తించారు. కాగా రాహుల్ భార్య రూబీ నవంబర్ 18న తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెపై అనుమానంతో విచారించారు. దీంతో అసలు విషయం బయట పడింది. రూబీ, ఆమె ప్రియుడు గౌరవ్ మరో వ్యక్తిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.
Uttar Pradesh | తల్లిని పట్టించిన కూతురు
రాహుల్, రూబీలకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 12 ఏళ్ల కుమారుడు, 10 ఏళ్ల కుమార్తె ఉన్నారు. పోలీసులకు వారి కుమార్తె కీలక వివరాలు చెప్పింది. తన తల్లిదండ్రులు తరచుగా గొడవపడేవారని, ముగ్గురు వ్యక్తులు తమ ఇంటికి వచ్చేవారని బాలిక చెప్పింది. తన తండ్రి హత్యలో తల్లి పాత్ర ఉందని ఆమె చెప్పింది. బాధ్యులైన ప్రతి ఒక్కరినీ ఉరితీయాలని పోలీసులను కోరింది. కాగా రాహుల్‌ను ఇంట్లోనే హత్య చేసి ముక్కలుగా చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రాహుల్ తల, ఇతర శరీర భాగాల కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు.