అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Floods | కుండపోత వర్షం కామారెడ్డి ప్రజలకు (Kamareddy People) కన్నీళ్లు మిగిల్చింది. వరదలతో పట్టణం అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా ఓ కాలనీ మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది.
వరదలతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. కామారెడ్డి ఎత్తయిన ప్రదేశంలో ఉంటుందని, ఇక్కడ వరదలు వచ్చే అవకాశం లేదని భావించిన ప్రజలకు భారీ వరదలు (heavy floods) ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంతటి జలవిలయానికి కారణమేమిటనే సందేహాలు సామాన్యుల మెదళ్లను తొలుస్తున్నాయి.
Kamareddy Floods | కబ్జాలే కారణమా..?
కామారెడ్డిని చరిత్రలో చూడని విధంగా వరదలు ముంచెత్తాయి. దాదాపు ఒకటిన్నర రోజులు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా మారిపోయాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా జీఆర్ కాలనీలో ఇళ్లన్నీ నీట మునిగాయి. ఈ పరిస్థితికి కారణం కబ్జాలేనని తెలుస్తోంది. గతంలో అనేక సార్లు వాగులో నుంచి వరదలు వచ్చాయి. అయినా ఇంతటి దుస్థితి (disaster) రాలేదు. కామారెడ్డి చెరువు పక్కనే వాగు ఉండడం, వాగును ఆనుకుని ఇళ్ల నిర్మాణం (House construction) ఉండడంతోనే ఇంతటి విలయానికి కారణమని తెలుస్తోంది.
Kamareddy Floods | ఇష్టానుసారంగా నిర్మాణాలు
హౌజింగ్ బోర్డు, జీఆర్ కాలనీలలో (Housing Board and GR colonies) నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. నాలాలు, వాగు స్థలాలను కబ్జా చేసి వాటిని వెంచర్లుగా మార్చి అమాయకులను చూసి అంటగట్టినట్టుగా ప్రచారం సాగుతోంది. వాగులు, కాల్వల పక్కన ఇళ్ల నిర్మాణం చేపట్టవద్దని నిబంధనలున్నా వాటిని తుంగలో తొక్కారని తెలుస్తోంది. అయితే ఇవన్నీ తెలిసి నాడు అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Kamareddy Floods | గతంలో జీపీ పరిధిలో కాలనీ
జీఆర్ కాలనీ గతంలో సరంపల్లి పంచాయతీ (Sarampalli Panchayat) పరిధిలో ఉండేది. ఆ సమయంలోనే అక్కడ వెంచర్ ఏర్పాటైంది. కొన్ని ప్లాట్ల విక్రయాలు జరపగా మరికొన్ని బిల్డింగులు కట్టి విక్రయించారు. అయితే 2004లో ఇటువంటి వరదలు ఆ కాలనీని చుట్టుముట్టాయి. కానీ మరీ ఇంతలా వరదలు రాలేదు. కేవలం డ్రెయినేజీలు పొంగిపొర్లాయి (drainages overflowed). అయితే చెరువును ఆనుకుని ఉన్న వాగు పెద్దగా ఉండేది. క్రమంగా ఆ వాగు కబ్జాకు గురైనట్టుగా కామారెడ్డి వాసులు చెబుతున్నారు. వాగు కబ్జాకు గురవడంతో పాటు వాగు అంచునే ఇళ్లను నిర్మించుకున్నారు. దాంతో వాగు ప్రవాహం పెరిగినప్పుడల్లా ఈ కాలనీ ప్రజలు భయం గుప్పిట జీవిస్తున్నారు.
Kamareddy Floods | ఎత్తులో ఉన్న కామారెడ్డి
కామారెడ్డి పట్టణం (Kamareddy town) ఉమ్మడి జిల్లాలో మిగతా నియోజకవర్గాల కంటే ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతంలో నీటి వనరులు తక్కువ. బోర్లపైనే వ్యవసాయ దారులు ఆధారపడి సాగు చేస్తుంటారు. వర్షాల కోసం ఎదురు చూసే ఈ ప్రాంతం ఇప్పుడు వరదల్లో చిక్కుకోవడం గమనార్హం.
Kamareddy Floods | పట్టణంలోనూ కబ్జాలు
కామారెడ్డి పట్టణానికి కాస్త దూరంగా ఉన్న హౌసింగ్ బోర్డు, జీఆర్ కాలనీలు మాత్రమే కాకుండా పట్టణం నడిబొడ్డున ఉన్న విద్యానగర్, అశోక్ నగర్, బతుకమ్మ కుంట లాంటి ప్రాంతాల్లో కూడా నాలాలు కబ్జాకు గురయ్యాయని తెలుస్తోంది. నాలాలపై ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడంతో డ్రెయినేజీలు కూడా నిర్మించలేని పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పట్టణం మొత్తం వర్షాకాలంలో (rainy season) వరదలు ప్రవహిస్తుంటాయి.
Kamareddy Floods | మొద్దునిద్ర వీడతారా..?
కామారెడ్డి చరిత్రలో ఇంతలా వరదలు రాలేదు. అయితే ఇంతటి వరదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా నాయకులు, అధికారులే కారణమన్న వాదన వినిపిస్తోంది. నాయకులు తమ స్వలాభం కోసం అడిగిన వారికి ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇప్పించారని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోకుండా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నాయకులు చెప్పిన వారికి అనుమతులు ఇవ్వడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులు, నాయకులపై ఉంది. కాగా.. అధికారులు, నాయకులు మొద్దు నిద్ర వీడి ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
Kamareddy Floods | కబ్జాలపై ఫిర్యాదులు రాలేదు
– రాజేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్
జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో వాగు, చెరువు ప్రాంతంతో పాటు నాలాలు కబ్జాకు గురయ్యాయని మా దృష్టికి రాలేదు. నాలాలపై నిర్మాణాల వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం వరదలో చిక్కుకున్న వారి పరిస్థితులు సాధారణ స్థితికి తెచ్చే పనిలో ఉన్నాం. కబ్జాలపై త్వరలోనే దృష్టి సారిస్తాం.
కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీలో ఇళ్లలోకి చేరిన మట్టిని తొలగిస్తున్న ఇంటి యజమానలుఉ
పట్టణంలోని జీఆర్ కాలనీలో ఓ ఇంట్లో తడిసిపోయిన బియ్యం
జీఆర్ కాలనీలో ఇంటి ముందు చేరిన బురదను తొలగిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది