అక్షరటుడే, ఆర్మూర్ : PDSU | రాష్ట్రంలో విద్యారంగంపై తీవ్ర నిర్లక్ష్యం నెలకొందని, వెంటనే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement), హాస్టల్ ఛార్జీలు, స్కాలర్షిప్లు అందించాలని పీడీఎస్‌యూ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్మూర్ పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన అనంతరం సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా (Sub Collector Abhigyan Malviya) కు వినతిపత్రం అందజేశారు.
PDSU | విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవు..
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కనీస సౌకర్యాలు లేవని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్ (PDSU District President Narender) , ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్ విమర్శించారు. అధ్యాపకుల కొరతతో విద్యార్థులు కళాశాలల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత కొన్ని నెలలుగా హాస్టల్ విద్యార్థులకు మెస్ బకాయిలు (Mess Dues) రాక హాస్టల్ వ్యవస్థ అధ్వానంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలవారి మెయింటనెన్స్ ఫీజు ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులపై ఆర్థికంగా భారం పడుతోందన్నారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం కాంగ్రెస్ పార్టీ (Congress Party) పరిపాలన ఏవిధంగా ఉందో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని అసెంబ్లీలో విద్యార్థుల పక్షాన మాట్లాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు నిఖిల్, రుచిత పాల్గొన్నారు.

