HomeతెలంగాణMinister Seethakka | కేటీఆర్‌కు ఎందుకింత అహంకారం..? ఆదివాసి బిడ్డ‌ను టార్గెట్ చేస్తారా...! అని సీత‌క్క...

Minister Seethakka | కేటీఆర్‌కు ఎందుకింత అహంకారం..? ఆదివాసి బిడ్డ‌ను టార్గెట్ చేస్తారా…! అని సీత‌క్క ధ్వ‌జం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Minister Seethakka | బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(BRS Working President KTR)పై మంత్రి సీత‌క్క నిప్పులు చెరిగారు. ఆదివాసి బిడ్డ మంత్రిగా ఎద‌గ‌డం చూసి ఓర్చుకోలేక పోతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. మంగ‌ళ‌వారం ములుగు జిల్లా(Mulugu District)లో ప‌ర్య‌టించిన సీత‌క్క విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. కేటీఆర్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆదివాసి మహిళా అని చూడకుండా నన్ను టార్గెట్ చేస్తున్నావ్ ఎందుకు అని నిల‌దీశారు. తాము సమ్మక్క సారక్క వారసులం, త‌మ జోలికి వస్తే నాశనమై పోతావని హెచ్చ‌రించారు.

Minister Seethakka | ఆడ‌బిడ్డ‌ను క‌న్నీళ్లు పెట్టించి బాగుప‌డ‌వు..

70 ఏళ్ల చరిత్రలో కోయ వర్గానికి మంత్రి పదవి రాలేద‌ని, ఇప్పుడు కాంగ్రెస్ ఆ అవ‌కాశం క‌ల్పిస్తే ఎందుకు ఓర్చుకోవ‌డం లేద‌న్నారు. కేటీఆర్‌కు ఇంత అహంకార‌మా? ఒక ఆదివాసి మ‌హిళ‌ను టార్గెట్ చేసి నువ్వు సాధించేది ఏమిట‌ని కేటీఆర్‌ను ఉద్దేశించి సీతక్క(Minister Seethakka) ప్ర‌శ్నించారు. నీ సొంత చెల్లె నీ అహంకారాన్ని చూసి నీపై మట్టి పోస్తుందన్నారు. నీవు నిజంగా వాస్తవాల మీద బతికిన వాడివైతే మనిషివైతే చెప్పు.. మేము ఎంతమందిని ఇబ్బంది పెట్టాం, ఎవరిని జైలుకు పంపించామని నిల‌దీశారు. మీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డనే నువ్వు ఓర్తలేవని కన్నీళ్లు పెట్టుకుంటుందని తెలిపారు. ఆడబిడ్డలంటే కేటీఆర్​కు గిట్ట‌ద‌ని, ఆడ‌వాళ్ల‌ను క‌న్నీళ్లు పెట్టించిన అత‌డు బాగు ప‌డ‌డ‌ని శాప‌నార్థాలు పెట్టారు.

Minister Seethakka | అభివృద్ధిని ఓర్వలేకే విమ‌ర్శ‌లు..

ఆదివాసి మ‌హిళ‌గా ప్ర‌జ‌ల క‌ష్టాలేమిటో త‌న‌కు తెలుస‌ని, వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తున్నాన‌ని సీత‌క్క తెలిపారు. అయితే, త‌న నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్(BRS) త‌ప్పుడు ఆరోపణలు చేస్తోంద‌ని విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల కోసం తాను క‌ష్ట‌ప‌డుతుంటే త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌తో బ‌ద్నాం చేయాల‌ని చూస్తారా? నేనేమన్నా తప్పులు చేస్తే అసెంబ్లీలో చర్చ పెట్టి నిలదీయండి. అతే త‌ప్ప మీడియా ముంద‌రికొచ్చి ఇష్టమొచ్చిన‌ట్లు మాట్లాడితే ఊరుకోన‌ని హెచ్చ‌రించారు. పక్క నియోజకవర్గాల నుంచి నాయ‌కుల‌ను తీసుకొచ్చి రోడ్ల మీద పోర్లాడితే సానుభూతి వస్తుందనుకోవడం కేటీఆర్ మూర్ఖత్వమ‌న్నారు.

Minister Seethakka | బీఆర్ఎస్ హ‌యాంలోనే పోలీసు రాజ్యం..

కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జా పాల‌న కొన‌సాగుతోంద‌ని సీత‌క్క తెలిపారు. బీఆర్ఎస్ ఆరోపిస్తున్న‌ పోలీసు రాజ్యం వారి పాల‌న‌లోనే ఉండేద‌ని సీతక్క అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎంతోమంది ఆత్మహత్యలకు కారణమైన మీరు ‘ములుగులో సీతక్క రాజ్యం.. పోలీస్ రాజ్యం న‌డుస్తుందంటూ ధర్నాలు చేస్తారా?’ అని ప్ర‌శ్నించారు. ములుగులో నడుస్తుంది ప్రజారాజ్యం, ఇందిరమ్మ రాజ్యమ‌ని స్ప‌ష్టం చేశారు. మీలా మేమేవ‌రి మీద క‌క్ష గ‌ట్ట‌లేద‌ని, ఎవ‌రినీ అన్యాయంగా జైలులో పెట్ట‌లేద‌న్నారు. దుబాయ్ లాంటి దేశాల్లో స్టూడియోలు ఏర్పాటు చేసుకుని త‌మ‌పై రోత వార్తలు ప్ర‌చారం చేయ‌డాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఆదివాసి బిడ్డనైన నన్ను టార్గెట్ చేయడానికి మిడుతాల దండును పంపిస్తున్న కేటీఆర్‌కు ప్ర‌జ‌లే బుద్ధి చెబుతార‌న్నారు.