అక్షరటుడే, హైదరాబాద్ : Ayudha Puja | నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహర్నవమి రోజున జరుపుకునే ముఖ్యమైన ఆచారం ఆయుధపూజ(Ayudha Puja). ఈ రోజున శక్తిస్వరూపిణి అయిన దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి లోకాన్ని రక్షించింది. దుష్టశక్తులపై విజయాన్ని సాధించిన ఈ పర్వదినం సందర్భంగా, మనం నిత్యం పనిచేయడానికి ఉపయోగించే వస్తువులను, పరికరాలను దైవంగా భావించి పూజించడం ఒక సంప్రదాయం.
Ayudha Puja | ఆయుధపూజ చేయడంలో అంతరార్థం
సాధారణంగా, ప్రతి వ్యక్తి ఏదో ఒక వృత్తిలో భాగంగా ఒక వస్తువును లేదా సాధనాన్ని ఉపయోగించి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తాడు. పనికి ఉపయోగించే ఆ సాధనం (ఆయుధం) సమర్థవంతంగా ఉంటే, ఆ పనిలో సగం విజయం సాధించినట్లేనని నమ్మకం. అందుకే, తమ జీవనోపాధికి మూలమైన ఆ వస్తువుకు కృతజ్ఞతగా, అది ఎల్లప్పుడూ సమర్థంగా పనిచేయాలని కోరుతూ పూజ చేస్తారు. ఈ పూజ ద్వారా వ్యక్తి తన పనిలో నిబద్ధతను, వృత్తి పట్ల గౌరవాన్ని పెంచుకుంటాడు.
ఆయుధపూజ వెనుక ఉన్న కథనం
ఆయుధపూజ వెనుక మహిషాసురమర్దిని కథ ఉంది.
దేవతల శక్తి సమర్పణ : మహిషాసురుడిని సంహరించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ శక్తిని ఏకం చేసి అమ్మవారికి ధారపోశారు. ఆ శక్తితో మరింత బలవంతురాలిగా మారిన అమ్మవారికి, మిగిలిన దేవతలు తమతమ ఆయుధాలను ఇచ్చారు.
భీకర యుద్ధం : వెయ్యి ఏనుగుల బలం, ఎనిమిది చేతులలో ఆయుధాలను ధరించి, సింహవాహనంపై ఆసీనురాలై అమ్మవారు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న మహిషాసురుడితో భీకర యుద్ధం చేసింది.
విజయం, ఆయుధ శుద్ధి : తాను ధరించిన దివ్యాస్త్రాలతో ఆ రాక్షసుడిని సంహరించి, లోకానికి శాంతిని ప్రసాదించింది. యుద్ధం ముగిసిన తర్వాత, ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని సకల దేవతలు మహిషాసురమర్ధిని(Mahishasuramardhini) స్తోత్రం పఠించి శాంతింపజేశారు.
ఆయుధాలకు కృతజ్ఞత : ఆ తరువాత, దేవతలు అమ్మవారి దగ్గర ఉన్న తమ ఆయుధాలను తిరిగి తీసుకుని, వాటిని శుద్ధి చేసి, యుద్ధంలో విజయం చేకూర్చినందుకు కృతజ్ఞతగా ఆయుధాలకు పూజ చేశారు.
పురాణాల ప్రకారం, అప్పటి నుండి ప్రతి యుద్ధానికి ముందు దుర్గాదేవి(Durga Devi) పూజతో పాటు ఆయుధపూజ చేయడం సంప్రదాయంగా మారింది.
Ayudha Puja | మహిషాసురమర్ధిని తత్వం:
విజయ దశమి(Vijaya Dashami) రోజున అమ్మవారు మహిషాసురుడిని అంతం చేస్తుంది. ఈ విజయమే దుర్గ నవరాత్రులలో చివరి రోజున మహిషాసురమర్దినిగా అమ్మవారి దర్శనానికి కారణం. పురాణ పండితులు చెప్పేదాని ప్రకారం, ప్రతి మనిషిలో ఉండే అరిషడ్వర్గాలు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) అనే చెడు గుణాలనే రాక్షసులుగా భావించాలి. ఈ అరిషడ్వర్గాలను నాశనం చేసి, మనిషిని జ్ఞానవంతుడిగా నిలబెట్టి, లోకాన్ని కాపాడటమే మహిషాసురమర్దిని తత్వం. అమ్మవారి నామాన్ని తలచి, మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని పఠిస్తే అరిష్టాలు తొలగిపోయి మార్గం సుగమం అవుతుందని భక్తుల నమ్మకం. శారీరక, మానసిక, భౌతిక సమస్యల నుండి అమ్మవారు విముక్తి కల్పిస్తారు.
నవమి రోజున అమ్మవారిని ఎరుపురంగు పూలతో పూజించి, గారెలు , పులిహోరను నైవేద్యంగా సమర్పించడం ఆచారం.