అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sircilla | సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అంటేనే కాంట్రవర్సీ అనే మాట ఇప్పుడు పరిపాటిగా మారుతోంది. ఒకప్పుడు సిరిసిల్ల కలెక్టర్‌గా పనిచేసిన కాంట్రవర్సీ ఐఏఎస్ సందీప్ కుమార్ ఝా (IAS Sandeep Kumar Jha) పేరు వినగానే వివాదాలు గుర్తుకొచ్చే పరిస్థితి.
ఆయన బదిలీ అనంతరం సిరిసిల్ల కలెక్టర్ (Sircilla Collector)గా పోస్టింగ్ అంటేనే ఐఏఎస్ అధికారులు జంకుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రాధాన్యం లేని పోస్టు అయినా సరే, సిరిసిల్లకు మాత్రం వెళ్లలేమని ఐఏఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయట.రాజన్న సిరిసిల్ల జిల్లా రాజకీయంగా అత్యంత సున్నితంగా మారిందన్నది అధికారిక వర్గాల మాట.
Sircilla | జంకుతున్న ఐఏఎస్‌లు
జిల్లా కేంద్రం సిరిసిల్ల నియోజకవర్గానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎమ్మెల్యేగా ఉండగా, సిరిసిల్ల కాంగ్రెస్ ఇంచార్జ్‌గా కేకే మహేందర్‌రెడ్డి ఉన్నారు. మరోవైపు పక్క నియోజకవర్గమైన వేములవాడ ఎమ్మెల్యే (Vemulawada MLA) ఆది శ్రీనివాస్ ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. దీంతో జిల్లా పరిపాలనపై అటు అధికార పార్టీ నేతలు, ఇటు ప్రతిపక్ష కీలక నేతల ఒత్తిడి తీవ్రంగా ఉంటోందని సమాచారం. ఈ క్రమంలో గత కలెక్టర్ ఈ నేతల మధ్య నలిగిపోయారన్న టాక్ వినిపిస్తోంది.గతంలో సిరిసిల్ల కలెక్టర్‌గా పనిచేసిన సందీప్ కుమార్ ఝా స్థానిక రాజకీయాల వల్లే వరుస కాంట్రవర్సీల్లో చిక్కుకున్నారని ప్రచారం జరిగింది. తొలుత కాంగ్రెస్ నేత కేకే మహేందర్‌రెడ్డి చెప్పిన ప్రకారం పనిచేశారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
చివరకు కేటీఆర్ ఫొటోతో ఉన్న టీ స్టాల్‌ను తొలగించడంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఒక దశలో కేటీఆర్ కూడా ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ‘‘ఆయన కలెక్టర్ కాదు, కాంగ్రెస్ కార్యకర్త’’ అంటూ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత అధికార పార్టీ విప్ ఆది శ్రీనివాస్‌కు కూడా ప్రోటోకాల్ పాటించలేదన్న ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయనను సిరిసిల్ల నుంచి బదిలీ చేశారన్న ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సిరిసిల్ల కలెక్టర్‌గా వెళ్లే ఐఏఎస్ అధికారి రాజకీయ నేతల మధ్య ఇరుక్కోవాల్సిందేనన్న భావన బలపడింది. దీనికి తోడు కోర్టు నోటీసులు, భూ పరిహార వివాదాలు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు కలిసి ఈ పోస్టును ‘హాట్ సీట్’గా మార్చేశాయని అధికారులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా, ప్రస్తుత సిరిసిల్ల జిల్లా కలెక్టర్ హరిత (Siricilla District Collector Haritha) కూడా విధుల్లో చేరిన నెల రోజుల్లోపే దీర్ఘకాలిక సెలవుల్లోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఇంచార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పేరుకు చైల్డ్ కేర్ లీవ్ అయినా, అసలు కారణం రాజకీయ ఒత్తిళ్లేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.