Brand Logos
Brand Logos | బ్రాండెడ్ దుస్తులపై లోగో ఎడమవైపే ఎందుకు ఉంటుంది? ఆసక్తికర కారణాలివే!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Brand Logos | ఫ్యాషన్ ప్రపంచం ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్‌తో ముందుకు సాగుతోంది. అందులో ముఖ్యమైన అంశం బ్రాండెడ్ దుస్తులు (branded cloths). ఏదైనా ష‌ర్ట్, టీ-షర్ట్, జాకెట్ కొనేటప్పుడు వాటిపై బ్రాండ్ పేరు లేదా లోగో ఎడమవైపు మాత్రమే ఉండడం మీరు గమనించి ఉంటారు. అయితే దీనికి గల కారణం కేవలం డిజైన్ కోసమే కాదు, వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం అని నిపుణులు చెబుతున్నారు. లోగో ఎడమవైపు ఉండడానికి ముఖ్య కార‌ణం ఏంటంటే.. సాధారణంగా మన గుండె ఎడమవైపే ఉంటుంది. బ్రాండ్‌లు తమ లోగోను అక్కడ ఉంచడం వల్ల, కస్టమర్‌తో భావోద్వేగ సంబంధం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది బ్రాండ్‌పై అభిమానం పెంచే ఒక సైకాలజికల్ ఎఫెక్ట్.

Brand Logos | క‌స్ట‌మ‌ర్స్‌ని ఆక‌ర్షించేందుకు..

దుస్తులపై కళ్లు ముందు ఎడమవైపునే పడతాయి. అందుకే కంపెనీలు తమ లోగోను అక్కడ ఉంచి ముందు మ‌న దృష్టిని ఆకర్షించేలా చేస్తాయి. ఇది బ్రాండ్ గుర్తింపు పెంచే టెక్నిక్ అని చెబుతున్నారు. మ‌రోవైపు బ్రాండ్ లోగో (Brand Logo) అనేది ఎప్పుడూ ఒకే ప్లేస్‌మెంట్‌లో ఉన్నట్లయితే.. అది మెదడులో మరింతగా నాటుకుపోతుంది. స్టడీల ప్రకారం ఎడమవైపు ఉండే లోగోలు గుర్తుపెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పోలీసులు, ఆర్మీ సిబ్బంది, స్కూల్ యూనిఫాంలు వీటన్నింటిలో పేర్లు, బ్యాడ్జ్‌లు ఎడమవైపునే ఉంటాయి. ఇది ఫ్యాషన్ ట్రెండ్‌గా మారి దుస్తుల డిజైనింగ్‌లో ప్రాముఖ్యత పొందింది.

ప్రపంచ జనాభాలో (world population) ఎక్కువ మంది కుడిచేతి వాడుకదారులే. వాళ్లకు జేబులు యాక్సెస్ చేయడం సులభంగా ఉండేందుకు జాకెట్లకు జేబులు ఎడమవైపు ఉంచుతారు. లోగో కూడా అదే వైపున ఉండడం వల్ల అందరూ అర్థం చేసుకునేలా ఉంటుంది. ఇది కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం చెప్ప‌డం జ‌రిగింది. ఇన్ని రోజులు మ‌నం ఎందుకు లోగో ఎడ‌మ వైపే (Left side logo) ఉంటుంద‌నే ఆలోచ‌న‌లో కాస్త అయోమ‌యానికి గురై ఉంటాం. కానీ ఇప్పుడు దీంతో కొంత క్లారిటీ అయితే వ‌చ్చి ఉంటుంది.