అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jubilee hills by election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలకమైన ప్రచార పర్వం ముగిసింది. ఈ ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.
జూబ్లీహిల్స్ స్థానానికి (Jubilee Hills seat) మంగళవారం ఉప ఎన్నిక జరగనుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే జోరుగా ప్రచారం చేశాయి. ఇంటింటికి వెళ్లి నాయకులు ఓటర్లను కలిశారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని వేడుకున్నారు. ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని మొదట్లో అంతా భావించారు. అయితే అనుహ్యంగా బీజేపీ సైతం ప్రచారం చివరి దశలో పుంజుకుంది.
Jubilee hills by election | అన్ని పార్టీలకు కీలకం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) గెలుపు అన్ని పార్టీలకు కీలకం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకుంటే స్థానిక ఎన్నికల్లో లాభం చేకూరుతుంది. ఒకవేళ ఓడిపోతే ఈ రెండేళ్ల పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని భావించాల్సి ఉంటుంది. దీంతో ఈ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు (Ministers and MLAs) ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అధికారంలో ఉన్న పార్టీ కావడం, బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపడం కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ ఎంఐఎం సపోర్టు తీసుకోవడంతో పాటు, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చింది. ఈ చర్యలతో ఆ వర్గం ఓట్లు పడితే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది.
Jubilee hills by election | బెడిసికొట్టిన సానుభూతి!
బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆది నుంచి పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది. సానుభూతి కలిసి వస్తోందిన మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) భార్యకు టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) మొదట్లో జోరుగా ప్రచారం చేశారు. అయితే హరీశ్‌రావు తండ్రి మృతి చెందడంతో ఆయన కొన్ని రోజుల పాటు ప్రచారంలో పాల్గొనలేకపోయారు. దీంతో కేటీఆర్ ఆయా డివిజన్లలో రోడ్ షోలు చేపట్టారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొన్నారు.
అయితే సానుభూతి కోసం సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఆ వ్యూహం బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల మాగంటి గోపీనాథ్ తల్లి కేటీఆర్‌పై (KTR) ఆరోపణలు చేశారు. మరోవైపు ఆయన మొదటి భార్య కుమారుడు సైతం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌పై ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ తల్లి ప్రశ్నలకు బీఆర్ఎస్ వైపు సమాధానాలు కరువయ్యాయి. దీంతో సానుభూతితో ఓట్లు వచ్చే అవకాశం లేదు. అయితే మైనారిటీ ఓట్లు చీలడంతో పాటు సెటిలర్ల ఓట్లు పడితే బీఆర్ఎస్ గట్టెక్కే అవకాశం ఉంది.
Jubilee hills by election | బండి రాకతో ఊపు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఆది బీజేపీ (BJP) లైట్ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అభ్యర్థిని ఆలస్యంగా ఖరారు చేయడంతో ప్రచారంలో కూడా జోరు చూపించలేదు. మీటింగ్‌లు, రోడ్ షోలు కూడా ఎక్కువగా నిర్వహించలేదు. దీనికి తోడు ప్రధాన నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ఆ పార్టీ పోటీలో లేదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ (Congress and BRS) మధ్యే పోటీ ఉంటుందని భావించారు. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ బోరబండ సమావేశంతో ఆ పార్టీకి ఊపు వచ్చింది. ఆయన హిందు ఓట్లను సంఘటితం చేసేలా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో హిందువుల ఓట్లు గంపగుత్తగా పడితే బీజేపీ గెలిచే అవకాశం ఉంది.