అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills by-Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపెవరిదో మరికొన్ని గంటల్లో తేలనుంది. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయి. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది. ఈ నెల 11 పోలింగ్ జరగ్గా.. 48.89 శాతం ఓటింగ్ నమోదైంది.
అయితే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని ప్రకటించగా.. అసలు ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు తీర్పు శుక్రవారం బయట పడనుంది.బీఆర్ఎస్ నుంచి గెలిచిన మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చాయి. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో నిలిచారు. కాంగ్రెస్ తన అభ్యర్థిగా నవీన్‌యాదవ్, బీజేపీ (BJP) లంకల దీపక్‌రెడ్డి పోటీలో నిలిపాయి. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీవ్రంగా శ్రమించింది. పలువురు మంత్రులు నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. మరోవైపు మైనారిటీ ఓట్ల కోసం ఎంఐఎం మద్దతు తీసుకోవడంతో పాటు అజారుద్దీన్ (Azharuddin)కు మంత్రి పదవి సైతం ఇచ్చింది. బీఆర్ఎస్ సైతం దూకుడుగా ప్రచారం చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లింది. కాంగ్రెస్ హామీలు అమలు చేయడం లేదని ఇంటింటికి బాకీ కార్డులు పంపిణీ చేసింది. అయితే ఓటరు ఎవరికి మద్దతుగా నిలిచారనేది శుక్రవారం తేలనుంది.
Jubilee Hills by-Election | కౌంటింగ్‌కు ఏర్పాట్లు
యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంలను భద్రపరిచారు. అక్కడే కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. కౌటింగ్ కోసం 42 టేబుళ్లు సిద్ధం చేశారు. ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు అధికారులు ఉంటారు. 10 రౌండ్లలో ఉప ఎన్నిక (Jubilee Hills by-Election) ఫలితాలు తేలనున్నాయి. ఒకటో నెంబర్ పోలింత్ బూత్ షేక్‌పేట డివిజన్ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో కౌంటింగ్ ముగుస్తోంది.
Jubilee Hills by-Election | వారితో నష్టం ఎవరికో..
ఉప ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఆర్ఆర్ఆర్ బాధితులు పోటీలో నిలిచారు. బరి సంఖ్యలో అభ్యర్థులు ఉండటంతో.. వారు ఏ పార్టీకి నష్టం చేశారో రేపు తేలనుంది. అలాగే బీఆర్ఎస్ (BRS) కారు గుర్తును పోలిన రోడ్ రోలర్, చపాతి మేకర్, ఆటో, సబ్బు పెట్టే గుర్తులను పలువురు అభ్యర్థులకు ఈసీ కేటాయించింది. ఆ గుర్తులతో బీఆర్ఎస్కు ఏమైనా నష్టం జరుగుతుందా అనేది తెలియనుంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి. అయితే ఓటింగ్ శాతంలో స్వల్పంగా తేడా ఉన్నట్లు ఆయా పోల్స్ పేర్కొన్నాయి. దీంతో అసలు ఫలితాలు ఎలా ఉంటాయోనని ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అభ్యర్థులు ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సంబంధం లేకుండా గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు.
Jubilee Hills by-Election | వైన్స్ బంద్
ఉప ఎన్నిక కౌంటింగ్ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం (Jubilee Hills Constituency)లో శుక్రవారం అన్ని లిక్కర్ షాపులు మూసి ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వైన్స్, బార్లు, కల్లు కాంపౌండ్లకు కూడా ఇది వర్తిస్తుందన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు.