అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nominations Withdrawal | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సందడి నెలకొంది. నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. తమను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.
రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు జరగనుండగా.. మొత్తం 19,608 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ప్రధాన పార్టీల్లో ఒక్కో వార్డులో చాలా మంది నామినేషన్ వేశారు. అయితే ఆయా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసి బీ ఫామ్‌లు అందజేశాయి. దీంతో బీ ఫామ్ (B Farm) రాని వారు బరిలో ఉంటారా.. నామినేషన్లు ఉపసంహరించుకుంటారా అనే ఉత్కంఠ నెలకొంది.
Nominations Withdrawal | త్రిముఖ పోరు
మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS), బీజేపీ మధ్య పోటీ ఉండగా.. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం మధ్య పోరు ఉంది. పార్టీ టికెట్ దక్కని వారు రెబల్‌గా పోటీ చేస్తే ఓట్లు చీలే అవకాశం ఉంది. అన్ని పార్టీల్లో రెబల్స్ బెడద ఉంది. చాలా మంది నాయకులు టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో టికెట్ రానివారిని నాయకులు బుజ్జగించే పనిలో పడ్డారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. దీంతో ఆయా పార్టీల నేతలు రెబల్స్‌ను బుజ్జగించి నామినేషన్లు విత్‌డ్రా చేయించే పనిలో పడ్డారు. ఈ రోజు రాత్రి వరకు బరిలో ఉండే అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.