అక్షరటుడే, వెబ్డెస్క్ : Nizamabad | నిజామాబాద్ కమిషనరేట్ (Nizamabad Commissionerate) పరిధిలోని ఓ స్టేషన్ నుంచి గంజాయి మాయం కావడం చర్చకు దారితీసింది. ఓ కేసులో భారీ మొత్తంలో పట్టుబడిన గంజాయి మాయమైంది. కాగా.. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. గంజాయి ఎక్కడికి పోయిందనే విషయమై విచారణకు ఆదేశించారు.
నిజామాబాద్ నగరం(Nizamabad City)లో “ఒక” స్టేషన్ పరిధిలో 2018లో పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడింది. దాదాపు 180 కిలోల గంజాయి నిల్వలను అప్పట్లో సీజ్ చేశారు. అనంతరం కోర్టులో సమర్పించి తిరిగి సేఫ్ కస్టడీ కోసం సదరు స్టేషన్లో భద్రపరిచారు. కాగా.. ఈ కేసు దర్యాప్తు ముగింపు దశకు వచ్చింది. ఇదే సమయంలో పట్టుబడిన నిషేధిత గంజాయిని డిస్ట్రాయ్(కాల్చాల్సి) ఉంది. ఇంతలోనే సంబంధిన స్టేషన్ నుంచి గంజాయి నిల్వలు(Seized Ganja) మాయం కావడం కలకలం రేపింది.
Nizamabad | ఏమై ఉంటుంది..?
దాదాపు క్వింటాలున్నర పైచిలుకు గంజాయి కనిపించకుండా పోవడం పోలీసు అధికారుల(Polece officers)ను ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా.. విచారణ చేపట్టిన అధికారులు సైతం విస్తుపోతున్నారు. అయితే సదరు స్టేషన్ ను ఈ మధ్యనే నూతన భవనంలోకి మార్చారు. ఆ సమయంలోనే ఏమైనా జరిగిందా..? లేక కావాలనే సిబ్బంది ఎవరైనా మాయం చేసి ఉంటారా? అనేది విచారణలో బయట పడనుంది. ఇవన్నీ ఇలా ఉంటే.. క్వింటాళ్ల కొద్దీ గంజాయి మాయమైతే.. ఎలుకలు తిని ఉండవచ్చని సంబంధిత స్టేషన్ అధికారులు, సిబ్బంది చర్చించుకోవడం కొసమెరుపు. అయితే ఒకరిద్దరు సిబ్బంది పాత్రపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.