అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana DGP | కొత్త డీజీపీ ఎంపికపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుత డీజీపీ జితేందర్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండడడంతో నూతన పోలీసు సారథి నియామకంపై ఫోకస్ చేసింది. సీనియారిటీ జాబితాలో ఉన్న ఐదుగురి పేర్లతో కూడిన జాబితాను కేంద్రానికి పంపించనుంది.
సీనియర్ ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి, శిఖాగోయల్, అభిలాష్ బిస్త్, సౌమ్య మిశ్రా పేర్లను పంపించనున్నట్లు సమాచారం. అయితే, శివధర్‌రెడ్డి(Shivdhar Reddy) వైపే సర్కారు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అనుకూల అధికారిగానే కాకుండా రెడ్డి సామాజికి వర్గానికి చెందిన ఆయనకే అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్న శివధర్‌రెడ్డిని పోలీసు బాస్‌గా నియమించడం దాదాపు ఖాయమైందన్న ప్రచారం జరుగుతోంది.
Telangana DGP | రేసులో పలుగురు..
ప్రస్తుత డీజీపీ జితేందర్(DGP Jitender) పదవీ విరమణ సెప్టెంబర్ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ రేసులో పలువురు పోటీ పడుతున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు రవిగుప్తా, సీపీ ఆనంద్, శివధర్‌రెడ్డి, సజ్జనార్, శిఖాగోయల్, అభిలాష్ బిస్త్, సౌమ్య మిశ్రా పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అయితే, వీరిలో 1994 బ్యాచ్‌కు చెందిన శివధర్ వైపే ముగ్గుచూపుతున్నట్లు సమాచారం. శివధర్‌రెడ్డి వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. 1990 బ్యాచ్‌కు చెందిన రవిగుప్తాకు డీజీపీగా అవకాశం దక్కకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. 1991 బ్యాచ్ కు చెందిన సీవీ ఆనంద్‌ను హోం సెక్రెటరీగా పంపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. మహేశ్ భగవత్‌ను హైదరాబాద్ సీపీగా, సజ్జనార్‌ను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించనున్నట్లు తెలిసింది.
Telangana DGP | సీనియారిటీలో వారే ముందు..
సీనియారిటీ పరంగా చూస్తే రవిగుప్తా అందరికంటే ముందున్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీజీపీగా పని చేశారు. అయితే, ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే ఆయన రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ని కలిసిన దరిమిలా ఈసీ ఆయనను పదవి నుంచి తప్పించింది. డిసెంబర్‌తో రవిగుప్తా పదవీకాలం ముగియనుండగా, ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వకపోవచ్చన్న భావన నెలకొంది. రవిగుప్తా తర్వాత సీనియారిటీ పరంగా ముందున్న హైదరాబాద్ పోలీసు కమిషనర్(Hyderabad Police Commissioner) సీవీ ఆనంద్‌కు కూడా ఈసారి నిరాశే మిగలొచ్చన్న ప్రచారం జరుగుతోంది. 2028 వరకు ఆయనకు పదవీ కాలం ఉండడంతో ఇప్పట్లో డీజీపీగా నియమించే అకాశం లేదని తెలిసింది.
Telangana DGP | శివధర్‌రెడ్డి వైపు సర్కారు చూపు..
మాజీ డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సీనియారిటీలో ముందున్నప్పటికీ, శివధర్‌రెడ్డి వైపే సర్కారు మొగ్గు చూపుతోంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే పోలీసు బాసుగా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృఢమైన నిర్ణయంతో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 2026 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్న శివధర్‌రెడ్డికి డీజీపీగా అవకాశం కల్పించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. శివధర్‌రెడ్డికి కాంగ్రెస్ అనుకూల వాదిగా పేరుంది. అదే సమయంలో సామాజికవర్గం కూడా ఆయనకు ప్లస్‌పాయింట్ కానుంది.
Telangana DGP | త్వరలో కేంద్రానికి జాబితా
నూతన డీజీపీ ఎంపిక కోసం సీనియారిటీ జాబితా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు పేర్లను త్వరలో కేంద్రానికి పంపించనుంది. అందులో నుంచి ముగ్గురు పేర్లను ఎంపిక చేసి, కేంద్రం తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. ఆ ముగ్గురు లోనుంచి ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది. సీనియర్ ఐపీఎస్ అధికారులు శివధర్‌రెడ్డి, సీవీ ఆనంద్, శిఖాగోయల్, అభిలాష్ బిస్త్, సౌమ్య మిశ్రా పేర్లను ప్రభుత్వం కేంద్రానికి పంపించనుంది. సీనియారిటీ జాబితాలో రెండో స్థానంలో ఉన్న శివధర్‌రెడ్డి పేరు కూడా కేంద్రం పంపించే జాబితాలో తప్పకుండా ఉంటుంది. అందుకే ఆయన నియామకం దాదాపు ఖాయమన్న చర్చ జరుగుతోంది.