HomeUncategorizedBJP | బీజేపీ సార‌థి ఎవ‌రో.. ఈ నెల‌లోనే నియ‌మించే అవకాశం!

BJP | బీజేపీ సార‌థి ఎవ‌రో.. ఈ నెల‌లోనే నియ‌మించే అవకాశం!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:BJP | భార‌తీయ జ‌న‌తా పార్టీ (Bharatiya Janata Party) జాతీయ అధ్య‌క్షుడు ఎవ‌ర‌నేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

పాకిస్తాన్‌తో వివాదం స‌ద్దుమ‌ణుగుతున్న వేళ కేంద్రంలోని బీజేపీ సంస్థాగ‌త విష‌యాల‌పై దృష్టి సారించ‌నుంది. ఈ నెల‌లోనే కొత్త సార‌థిని ఎన్నుకునే అవ‌కాశ‌ముంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. అంతర్గత చర్చలు జరుగుతున్నాయని, జూన్ రెండు లేదా మూడో వారం నాటికి అధికారిక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సంబంధిత‌ వర్గాలు వెల్ల‌డించాయి. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా (JP Nadda) ప‌ద‌వీకాలం 2024లోనే ముగిసింది. అయితే, లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న ప‌ద‌వీకాలాన్ని పొడిగించారు. కొత్త అధ్య‌క్షుడి ఎన్నిక వ‌ర‌కూ ఆయ‌నే కొన‌సాగ‌నున్నారు.

BJP | రాష్ట్రాల్లో సంస్థాగ‌త ఎన్నిక‌లు పూర్తి..

బీజేపీ చాలా రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసింది. తదుపరి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ముందు రాష్ట్రాల్లో సంస్థాగ‌త ఎన్నిక‌ల‌ను పూర్తి చేయాల‌న్న‌ది పార్టీ రాజ్యాంగం నిబంధ‌న‌. ఈ నేప‌థ్యంలోనే కొన్ని మిన‌హా మిగ‌తా మెజార్టీ రాష్ట్రాల్లో ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో 70 జిల్లాల‌ అధ్యక్షులను నియ‌మించారు. ఈ నేప‌థ్యంలోనే కేంద్ర నాయకత్వం త్వరలో బీజేపీ చీఫ్ పదవిపై నిర్ణయం తీసుకోవచ్చనే ఊహాగానాలకు మరింత బ‌లం చేకూర్చింది.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో ఈ ప్రక్రియ కొంతకాలం ఆలస్యం అయిందని చెబుతున్నారు. జాతీయ స్థాయి నియామకానికి ముందు బీజేపీ మొదట ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌తో సహా కీలక రాష్ట్రాల్లో కొత్త రాష్ట్ర యూనిట్ అధ్యక్షులను ఖరారు చేయవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

BJP | కులాల స‌మీక‌ర‌ణ‌

కుల సమీకరణాలు కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో, బ్రాహ్మణ సామాజిక వ‌ర్గాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, పార్టీలోని కొన్ని విభాగాలలో OBC నాయకుడికి అవ‌కాశం ఇవ్వాల‌న్న డిమాండ్ మొద‌లైంది. ఇటీవలి ఎన్నికల తర్వాత బీజేపీలో మార్పు క‌నిపిస్తోంది. ఓబీసీ(OBC)ల‌కు పార్టీ ప్రాధాన్యం క‌ల్పిస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత నాయకత్వ నిర్మాణంలో ఓబీసీ ముఖ్యమంత్రి ఉండ‌గా, బ్రాహ్మణ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్ర అధ్యక్ష పదవికి బ్రాహ్మణ నాయకుడికి అవ‌కాశం క‌ల్పించ‌వ‌చ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, తెలంగాణ‌(Telangana)లో బీసీ వ్య‌క్తికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించే అవ‌కాశ‌ముందని తెలిసింది. రాష్ట్ర స్థాయి సమీకరణాలు ఖరారు అవుతున్న నేప‌థ్యంలో జాతీయ అధ్యక్ష పదవిపై అంద‌రి దృష్టి నెల‌కొంది.

BJP | ప‌రిశీల‌న‌లో ముగ్గురి పేర్లు

బీజేపీ జాతీయ సార‌థి పోటీలో ముగ్గురి మ‌ధ్య ప్ర‌ధానంగా పోటీ నెలకొంది. ఒడిశాకు చెందిన కీలక ఓబీసీ నాయకుడు, కేంద్ర నాయకత్వానికి సాన్నిహిత్యానికి పేరుగాంచిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Union Minister Dharmendra Pradhan) పేరు ప్ర‌ధానంగా వినిపిస్తోంది. ఇక‌, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్ర‌స్తుత కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan) కూడా రేసులో ఉన్న‌ట్లు సమాచారం. ఆయ‌న గ్రాస్‌రూట్ అనుభవం ఉన్న మాస్ లీడర్‌గా పేరొందారు. ఇక‌, ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి పాత్ర నుంచి కేంద్ర మంత్రివర్గానికి మారిన మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) పేరును కూడా బీజేపీ నాయ‌క‌త్వం పరిశీలిస్తుంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ తుది ఎంపిక సంస్థాగత అనుభవం, ప్రాంతీయ ప్రాతినిధ్యం, కుల సమతుల్యతను పరిగణనలోకి తీసుకుని కొత్త సార‌థిని ఎన్నుకునే అవకాశ‌ముంది.

Must Read
Related News